భారత రెజ్లర్ బజరంగ్‌ పునియాకు బెదిరింపులు

భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  9 Sep 2024 7:00 AM GMT
భారత రెజ్లర్ బజరంగ్‌ పునియాకు బెదిరింపులు

భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. బజరంగ్ పునియాకు తాజాగా బెదిరింపులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండ్రోజుల వ్యవధిలోనే ఆయనకు వాట్సాప్‌ మెసేజ్‌ల రూపంలో బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. బెదిరింపులు వచ్చిన తర్వాత బజరంగ్‌ పునియా పోలీసులను ఆశ్రయించారు. సోనిపట్‌లోని బహల్‌ఘర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ పార్టీని వీడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వాట్సాప్‌ మెసేజ్‌లో తనని హెచ్చరించారని బజరంగ్ పునియా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

హర్యానాలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా హస్తం పార్టీలో చేరారు. దాంతో.. ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా కనిపిస్తున్నాయి. గత శుక్రవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌లో చేరారు. కేసీ వేణుగోపాల్‌ వీరిద్దరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత వినేశ్, బజరంగ్ పునియా ఇద్దరూ రైల్వే ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి.

Next Story