భారత్‌కు వచ్చే మూడు వారాలు కీలకమని.. కరోనా కేసులు పెరిగేకొద్ది దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిత్ర తెలిపారు. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని.. ఈ క్రమంలో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే.. మరికొన్ని ఎక్కువ ప్రభావం చూపుతూ వ్యాప్తిలో ఉంటాయన్నారు. ఆయా వైరస్‌ల జన్యుక్రమం ఆవిష్కరించే పరిశోధనలు సాగుతున్నాయని తెలిపారు.
బి.1.617 రకం ఇతర వైరస్ రకాల కంటే ఎక్కువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి తగిన ఆధారాలు లేవన్నారు. దీని వ్యాప్తి ప్రస్తుతం 10 శాతం లోపే ఉందన్నారు. ఈ 484క్యూ, ఎల్ 452 ఆర్ మ్యుటేషన్లతో పాటు మరికొన్ని బి.1.617లో ఉన్నాయన్నారు. భారత్‌లో ఈ రకం ఆక్టోబరులో బయటపడిందని చెప్పారు. అప్పట్లో చాలా మంది మాస్క్ లేకుండా తిరగడం.. టీకా వచ్చిందని జాగ్రత్తలను తీసుకోకపోవడం వంటి కారణాల చేత కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఇలాగే కొనసాగితే మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తేనే మహమ్మారి అడ్డుకోగలమని సూచించారు.