రాజస్థాన్ కాంగ్రెస్ పంచాయతీ ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ల మధ్య గొడవ మరింత పెద్దదవుతూ ఉంది. తాజాగా సచిన్ పైలట్ మాట్లాడుతూ రాజకీయ నాయకుడిని అయినంత మాత్రాన, తానూ మనిషినేనని అన్నారు. ఇటీవల తనను కొన్ని వ్యాఖ్యలు బాధించాయని, అయితే మళ్లీ గతంలోకి తొంగిచూడాలని భావించట్లేదని సచిన్ చెప్పుకొచ్చారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ప్రస్తుతం తన కర్తవ్యమని సచిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలు ఎవరి చేతుల్లో పెట్టాలన్నది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు మళ్లీ ఇద్దరి మధ్య చిచ్చుబెట్టాయి. అశోక్ రాజీనామా చేసుంటే ఖచ్చితంగా సచిన్ సీఎం అయ్యేవారు. కానీ అలా జరగలేదు. కొద్దిరోజుల క్రితం అశోక్ గెహ్లాట్ మాట్లాడతూ.. సచిన్‌ను విశ్వాస ఘాతకుడు అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. అతను ఎప్పటికీ సీఎం కాలేడని, పార్టీ హైకమాండ్ కూడా ఆయనను ముఖ్యమంత్రిగా చేయదని అశోక్ గెహ్లాట్ అన్నారు. అయితే పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని.. రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని సచిన్ పైలట్ స్పష్టం చేశారు.