ట్రాఫిక్ జామ్ కారణంగా నెలకు రెండు లక్షల ఆదాయం..!
Thane man quits job now sells Vada Pav at Traffic Signals.సాధారణంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్అవుతుంది కానీ ట్రాఫిక్ జామ్ కారణంగా నెలకు రెండు లక్షల ఆదాయం.
By తోట వంశీ కుమార్ Published on 16 Jan 2021 12:16 PM ISTసాధారణంగా మనం ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే ఎంతో చిరాకు పడుతూ ఉండడం సర్వసాధారణమే. కానీ ట్రాఫిక్ జామ్ అవడం కారణంగా ఓ వ్యక్తి నెలకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా?మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదని ఎన్నో సందర్భాలలో ఎంతోమంది రుజువు చేశారు. తాజాగా థానేకి చెందిన గౌరవ్ అనే వ్యక్తి కూడా తనకి వచ్చిన విభిన్నమైన ఆలోచన ద్వారా నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఒక రోజు ముంబై వెళుతున్న గౌరవ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ జామ్ అవడంతో దాదాపు నాలుగు గంటల సమయం పాటు ట్రాఫిక్ లో వేచి ఉన్నాడు. అప్పుడు పక్కనే బఠానీలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని చూసాడు గౌరవ్. అప్పుడే అతనికి కూడా కొత్త ఆలోచన తట్టింది. ఆలోచన రావడమే మొదలు దానిని ఆచరణలో పెట్టి మంచి విజయం సాధించాడు. బఠానీలు అమ్మినట్లు ట్రాఫిక్ జామ్ లో వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన తనకు వచ్చింది.
తనకు ఆ ఆలోచన రావడంతో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 లో"ట్రాఫిక్ వడ పావ్" బిజినెస్ స్థాపించాడు. ఎంతో ఫ్రెష్ గా, రుచిగా ఉండే వడ పావ్ తో పాటు ఒక చిన్న వాటర్ బాటిల్ కూడా ప్యాక్ చేసి ఆ ప్యాకెట్ ధర రూ.20 చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద అమ్మేవాడు. సాయంత్రం ఐదు గంటల నుంచి 10 గంటల సమయం మధ్యలో ఈ వడ పావ్ ప్యాకెట్లను విక్రయిస్తూ ప్రస్తుతం నెలకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నాడు.
మొదట్లో పిజ్జా డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న గౌరవ్ పని ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు బాగా ఆకలి వేసేదని ప్రస్తుతం ఆ అనుభవమే ఇప్పుడు ఉపయోగకరం అని తెలియజేశాడు. అయితే మొదటిరోజు వడా పావ్ ప్యాకెట్లు ఎవరు కొనలేదు. తరువాత వారంలో తను తీసుకెళ్ళినవి అయిపోగా అమ్మకు ఫోన్ చేసి మరికొన్ని కావాలని తెలిపాడు. ఈ విధంగా అప్పటి నుంచి వారి బిజినెస్ ముందుకు దూసుకుపోతుంది. ప్రస్తుతం గౌరవ్ ఒక షాపు అద్దెకి తీసుకుని ఎనిమిది మంది డెలివరీ బాయ్స్ ను 6 వేల రూపాయల వేతనంతో నియమించుకున్నాడు. ప్రస్తుతం ప్రతి రోజు దాదాపు 800 వడ పావ్ విక్రయిస్తున్నట్లు గౌరవ తెలిపారు.