విషాదం.. మొబైల్​ ఫోన్​ పేలి పసికందు మృతి

Terrible tragedy.. Baby girl dies after mobile phone explodes in UP. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విషాద ఘటన చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ పేలి పసికందు మృతి చెందింది.

By అంజి  Published on  13 Sept 2022 3:01 PM IST
విషాదం.. మొబైల్​ ఫోన్​ పేలి పసికందు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విషాద ఘటన చోటు చేసుకుంది. మొబైల్‌ ఫోన్‌ బ్యాటరీ పేలి పసికందు మృతి చెందింది. నేహా అనే ఎనిమిది నెలల పాప నిద్రిస్తున్న మంచంపై లావా కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ పేలింది. సోలార్ ప్యానెల్ ద్వారా మొబైల్‌కు ఛార్జింగ్‌ పెట్టారు. ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన ఫోన్‌ను ఛార్జింగ్ కోసం ప్లగ్ చేయగా వేడెక్కడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర గాయాల పాలైన పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచింది.

తల్లి కుసుమ్ బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లినప్పుడు పసికందును మంచంపై పడుకోబెట్టింది. అదే మంచంపై ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి ఉంది. కాసేపటి తర్వాత పెద్ద శబ్ధాలు, కేకలు విని తల్లి పరిగెత్తింది. తల్లి అక్కడికి వచ్చేసరికి పసికందు చేతులు, వీపు పూర్తిగా కాలిపోయాయి. పసిబిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పసికందును రక్షించడానికి ప్రయత్నించారు, అయితే ఆమె చికిత్స పొందుతూ మరణించింది.

లైటింగ్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ కోసం సోలార్‌ ప్యానెల్స్‌ తీసుకొచ్చామని కూలీ పనులు చేసే పసికందు తండ్రి సునీల్‌కుమార్‌ తెలిపాడు. సునీల్‌ కుమార్ మాట్లాడుతూ.. ''నా భార్య మా కుమార్తెకు స్నానం చేయించి, ఫోన్ ఛార్జింగ్‌ పెట్టిన మంచం మీద ఉంచింది. నేను ఆమెను శిశువుకు బట్టలు వేసి వేరే మంచంలోకి మార్చమని అడిగాను. అయితే ఆమె చేస్తానని చెప్పింది." అని చెప్పాడు. ఆ తర్వాత సునీల్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుసుమ్ కూడా ఛార్జింగ్ కోసం పెట్టుకున్న ఫోన్‌ని మరిచిపోయింది. పసికందు అరుపులు, కేకలు విన్న వారంతా తిరిగి ఇంటికి చేరుకున్నారు.

అప్పటికే మంచానికి మంటలు అంటుకోవడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు కూడా వారు పంపలేదు. అయితే ఆ మొబైల్ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

Next Story