ఢిల్లీ రైతు ఉద్యమ శిబిరాలకు నిప్పు
Delhi peasant movement camps set on fire.రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్న శిబిరాల్లోని గుడారాలకు దుండగులు గురువారం మరోసారి నిప్పు పెట్టారు.
By తోట వంశీ కుమార్
నూతన వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కోసం ఢిల్లీ శివారు ప్రాంతంలో ఆందోళన చేస్తున్న అన్నదాతలపై కుట్రలు కొనసాగుతున్నాయి. రైతులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్న శిబిరాల్లోని గుడారాలకు గుర్తు తెలియని దుండగులు గురువారం మధ్యాహ్నం మరోసారి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మూడు గుడారాలు, ఒక కారు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. రైతులు అప్రమత్తం అవ్వడంతో ప్రాణహాని తప్పింది.
ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన ఘాజీపూర్, పల్వాల్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు షాజహాన్‌పూర్ వద్ద రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 138వ రోజైన గురువారం మధ్యాహ్న సమయంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు గుడారాలకు నిప్పు అంటించారు. ఎర్రటి ఎండ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన రైతులు మంటలను ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ మూడు గుడారాలు, ఒక కారు పూర్తిగా కాలిపోయాయి. ఫర్నీచర్, సామాన్లు పూర్తిగా దగ్దమయ్యాయి. దుండగులపై రైతులు కుండ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. విచారణ చేపడుతామని మాత్రమే చెప్పారని రైతులు చెబుతున్నారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి గుడారం దగ్గర కనిపించాడనీ, చూస్తుండగానే టెంట్‌కు నిప్పంటించాడని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ మంటలనార్పే ప్రయత్నాల్లో ఉండగానే.. మరో వ్యక్తి ఇంకో గుడారానికి నిప్పంటించి పారిపోయాడాన్నారు. రైతుల గుంపులో కలిసిపోవడంతో పట్టుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదుని తెలిపారు. బిఆర్‌టిఎస్ వైపు నుండి వచ్చిన దుండగుడు రెండు గుడారాలకు నిప్పంటించినట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలవ్వలేదనీ, అయితే ఫర్నీచర్, ఇతర సామాగ్రి కాలిపోయినట్లు పేర్కొన్నారు.