టెన్త్ బోర్డు ఎగ్జామ్‌లో వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌పై ప్రశ్న
టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షల్లో సాధారణంగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి.
By Srikanth Gundamalla Published on 12 March 2024 5:55 AM GMTటెన్త్ బోర్డు ఎగ్జామ్‌లో వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌పై ప్రశ్న
టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షల్లో సాధారణంగా సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వింతవింత ప్రశ్నలు అడిగిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లో జరిగిన స్టేట్ టెన్త్ క్లాస్ బోర్డు పరీక్షల్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించి ప్రశ్న అడిగారు. అహ్మదాబాద్‌లో జరిగిన 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూశారా? మీ పరిశీలనను బట్టి ఆ మ్యాచ్ గురించి ఓ రిపోర్ట్ రాయండి అంటూ ప్రశ్నను అడిగారు. క్వశ్చన్ పేపర్‌లో 55వ బిట్‌గా 4 మార్కుల కోసం ఈ ప్రశ్న వచ్చింది.
ఇక ఈ ప్రశ్న చూసిన విద్యార్థులు షాక్ అయ్యారు. సబ్జెక్టులోని ప్రశ్న కాకుండా ఇలా క్రికెట్ కు సంబంధించిన ప్రశ్న వచ్చిందేంటని అనుకున్నారు. ఇక మ్యాచ్ చూసినవారు.. క్రికెట్ అభిమానులు ఈ ప్రశ్న చూసి సంతోష పడి సమాధానం రాసుకొచ్చారు. గుజరాత్‌లో గతేడాది అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా వచ్చిన టీమిండియా.. కప్‌ను మాత్రం గెలవలేకపోయింది. నవంబర్ 19న ఈ మ్యాచ్ జరగ్గా అందులో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. వన్డే వరల్డ్ కప్ -2023 ట్రోఫీని సొంతం చేసుకుంది. క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశలతో భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలుస్తుందని అనుకున్నారు. కానీ.. ఫైనల్‌లో బ్యాటర్లు విఫలం కావడంతో కప్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. ఆరోసారి వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ను ఆసీస్ ఎగురేసుకుపోయింది.
వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్‌గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా పెద్దగా రాణించలేకపోయింది. రోహిత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి 47 పరుగులు చేశాడు. గిల్, శ్రేయస్ అయ్యర్ నిరాశపరిచారు. కోహ్లీ, కేఎల్ అతిజాగ్రత్తగా ఆడారు. విరాట్ 63 బంతుల్లో 54 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. జడేజా 9 పరుగులు, సూర్యకుమార్ 18 పరుగులు మాత్రమే చేయగలిగారు. 50 ఓవర్లలో ఇండియా 240 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇక ఆసీస్ కూడా తొలుత బ్యాటింగ్‌లో తడబడింది. 47 పరుగులకే మూడుకు వికెట్లు కోల్పోయింది. కానీ.. ట్రావిస్ హెడ్, లబుషేన్ కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగుల జోడించారు. ఆసీస్‌కు ఘనవిజయాన్ని అందించారు.