కొవిడ్ కేంద్రాలుగా దేవాల‌యాలు..!

Temples as covid centres.దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్‌ సెంటర్లుగా మారిపోయాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 May 2021 7:31 AM IST
temples

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఆస్ప‌త్రుల‌న్ని దాదాపు రోగుల‌తో నిండిపోతున్నాయి. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండ‌డంతో ఆస్ప‌త్రుల్లో ఉన్న బెడ్ల సంఖ్య చాల‌డం లేదు. క‌రోనా రోగులంద‌రిని ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందించ‌డం సాధ్యం కావ‌డం లేదు. దీంతో తీవ్ర ల‌క్ష‌ణాల‌ను ఉన్న వారిని మాత్ర‌మే ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నావారు, అస‌లు ల‌క్ష‌ణాలు లేని వారికి.. ఐసోలేష‌న్ కేంద్రాలు, హోం ఐసోలేష‌న్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే.. చాలా మందికి హోం ఐసోలేష‌న్ లో ఉండ‌డం సాధ్యం కావ‌డం లేదు. ఒక్క గ‌ది మాత్ర‌మే ఉండ‌డం.. కుటుంబ స‌భ్యులంతా ఉంటుండ‌డం వంటి కార‌ణాల‌తో చాలా మంది ఐసోలేష‌న్ కేంద్రాల‌కు వెలుతున్నారు.

దీంతో.. ప్రధాన దేవాలయాలు ఇప్పుడు కోవిడ్‌ సెంటర్లుగా మారిపోయాయి. క‌రోనా విజృంభిస్తున్న వేళ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రాలు కరోనా రోగులకు బాసటగా నిలుస్తున్నాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేలాదిమంది రోగులు ఇప్పుడు ఆలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. చికిత్స పొందుతున్నారు. ఇక హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ లోని విశ్వనాథాలయం కోవిడ్‌ పేషెంట్లకు నిరంతర అన్నవితరణ చేస్తోంది. గుజరాత్‌ లోని బోటాడ్‌ జిల్లాలోని ప్రసిద్ధి సారంగ్‌ పూర్‌ హనుమాన్‌ మందిరం కూడా దాని ధర్మశాలను 100 పడకల ఆస్పత్రిగా మార్చింది. ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్‌ మందిరాన్ని కోవిడ్‌ సెంటర్‌గా మార్చిన విషయం తెలిసిందే.

ఇక ఒరిస్సాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ మందిరానికి చెందిన నీలాచల్‌ భక్త నివాస్‌ ను కోవిడ్‌ సెంటర్‌ గా మార్చాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. 120 పడకలతో ఇతర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిఅందుబాటులోకి తేనున్నారు. ముంబైలోని కందివాలిలోని పవన్‌ ధామ్‌ ఆలయం తన నాలుగంతస్తుల భవనాన్ని 100 పడకలతో కూడిన కోవిడ్‌ సెంటర్‌ గా మార్చేసింది. 50 పడకలకు ఆక్సిజన్‌, అక్కిమీటర్లు, పల్స్‌ మీటర్లు, బీపీ మిషన్లు. మానిటర్‌ మిషన్లు సిద్ధం చేశారు.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని దేవాల‌యాల‌ను ప్ర‌భుత్వం కొవిడ్ కేర్ సెంట‌ర్లుగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 16 పెద్ద ఆల‌యాల్లో వెయ్యి బెడ్లు ఏర్పాటు చేస్తోంది. చిన్న గుడుల్లో 25 బెడ్ల‌తో చికిత‌స్ అందిస్తోంది. శ్రీశైలం, అన్న‌వ‌రం, విజ‌య‌వాడ‌, క‌న‌క‌దుర్గ, ద్వార‌కా తిరుమ‌ల‌, కాణిపాకం, శ్రీకాళ‌హ‌స్తి, శ్రీకాకుళం అర‌స‌వెల్లి, సింగ‌ర‌కొండ‌, మ‌హానంది, సింహాచ‌లం, పెదకాకాని, జొన్న‌వాడ ఆల‌యం, క‌సాపురం, దిగువ‌ల్లి ఆల‌యాల్లో ప్రాథ‌మిక వైద్య సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి.


Next Story