రెండున్న‌ర గంట‌ల ఆల‌స్యంగా వ‌చ్చిన రైలు.. ప్ర‌యాణీకుల‌కు రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం

Tejas train delayed by 2 hours IRCTC to pay compensation to passengers.రైలు స‌రిగ్గా స‌మ‌యానికి రావ‌డం చాలా అరుదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Aug 2021 7:58 AM GMT
రెండున్న‌ర గంట‌ల ఆల‌స్యంగా వ‌చ్చిన రైలు.. ప్ర‌యాణీకుల‌కు రూ.4ల‌క్ష‌ల ప‌రిహారం

రైలు స‌రిగ్గా స‌మ‌యానికి రావ‌డం చాలా అరుదు. ఎప్పుడు ఏ రైలు ఎక్క‌డ ఆగుతుందో ఎప్పుడు వ‌స్తుందో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రీ రైలు ఆల‌స్యంగా వ‌స్తే.. ప‌రిహారం అందించ‌డం గురించి మీరు విన్నారా..? భారత్‌లో తొలి ప్రైవేటు రైలు తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ రెండున్న‌ర‌ గంట‌లు ఆల‌స్యమైన కార‌ణంగా..రూ.4లక్ష‌ల న‌ష్ట‌పరిమారం చెల్లించాల్సి వ‌చ్చింది. ఢిల్లీ-లక్నో మధ్య నడిచే భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ శని,ఆదివారం మూడు ట్రిప్పుల్లో రెండున్నర గంటలు ఆలస్యమైంది. ఈ కారణంగా ఐఆర్‌సీటీసీ మొదటిసారి గరిష్టంగా 2035 మంది ప్రయాణికులకు రూ. 4 లక్షల పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

శనివారం భారీ వర్షం వల్ల ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో సిగ్నల్ ఫెయిల్ అయింది. దీని కారణంగా తేజస్ రైలు దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా స్టేషనుకు చేరుకుంది. ఆదివారం కూడా లక్నో-ఢిల్లీ రైలు సుమారు గంటపాటు ఆలస్యమైంది. కాగా.. నిబంధ‌న‌ల ప్ర‌కారం తేజస్ రైలు ఒక గంట ఆలస్యమైతే ఒక్కో ప్రయాణికుడికి రూ .100, రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యానికి రూ .250 పరిహారం చెల్లించాల‌నే నిబంధ‌న ఉంది. ఈ రైలును నడుపుతున్న ఐఆర్‌సీటీసీ ప్రతి ప్రయాణికుడికి 250 రూపాయల చొప్పున, శనివారం రెండు ట్రిప్పుల తేజస్ 1574 మంది ప్రయాణీకులకు మొత్తం 3,93,500 రూపాయలు తిరిగి చెల్లించారు. ఆదివారం మొదటి రౌండ్‌లో 561 మంది ప్రయాణీకులకు 150 రూపాయలు చొప్పున చెల్లించాల్సి వచ్చింది.

ఆగ‌స్టు 4, 2019న విమానం లాంటి వ‌స‌తుల‌తో తొలి తేజ‌స్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ఢిల్లీ వెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో గంట‌లోపు రైలు ఆల‌స్య‌మైన సంద‌ర్భాలు ఐదుసార్లు మాత్ర‌మే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆల‌స్యం కాద‌ని ఐఆర్‌సీటీసీ చెబుతోంది.

Next Story
Share it