నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ట్రాక్టర్ల పరేడ్‌ను నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. అయితే.. అనుకున్న సమయానికి కంటే ముందుగానే ప్రారంభించారు. మరోవైపు రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు జరుగుతుండడంతో.. రైతుల్ని ఆపేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
టిక్రీ సరిహద్దు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో రైతులు వస్తుండడంతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సరిహద్దు వద్ద భారీగా పోలీసులు మొహరించారు. ర్యాలీ ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారితో ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించారు. సింఘు, ఘాజీపూర్ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ముకర్భా ప్రాంతంలో బారికేడ్లను తొలగించే క్రమంలో ఆందోళనకారులు పోలీసుల వాహనంపైకి ఎక్కారు.
దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులను నిలువరించేందుకు వాటర్ క్యానన్లు కూడా ప్రయోగించి వారిని అడ్డగించేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తలెత్తిన ఘర్షణలో భద్రతాబలగాల వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈలోగా రాజ్‌పథ్‌లో గణతంత్ర పరేడ్ ముగియడంతో.. పోలీసులు వెనక్కి తగ్గి ర్యాలీ ముందుకు సాగేందుకు అనుమతించారు.