రాజకీయాల్లోకి మహ్మద్‌ షమీ? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 4:58 AM GMT
team india, cricketer, shami, political entry,

రాజకీయాల్లోకి మహ్మద్‌ షమీ? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..!

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్ షమీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌ కప్-2023 టోర్నీలో అద్భత ప్రదర్శనను కనబర్చాడు. టీమ్‌లోకి కాస్త లేట్‌గానే ఎంట్రీ ఇచ్చినా కూడా వరుస పెట్టి వికెట్లు తీస్తూ టీమిండియా ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. తాజాగా ఈ స్టార్ పేసర్ మహ్మద్‌ షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారని సమాచారం.

ప్రస్తుతం టీమిండియా స్టార్‌ పేసర్ షమీ జట్టుకు దూరంగా ఉన్నాడు. కొన్ని గాయాల కారణంగా అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అంతేకాదు.. త్వరలోనే ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌లో కూడా ఆడటం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. బెంగాల్‌ జట్టు తరఫున రంజీ ట్రోఫీలో షమీ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. షమీ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఆయన రంజీలో ప్రాతినిథ్యం వహిస్తోన్న బెంగాల్‌ నుంచే లోక్‌సభ ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ అతన్ని పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులు షమీతో ఇప్పటికే ఓ సారి చర్చలు కూడా జరిపారనీ.. వారి ప్రతిపాదనలకు షమీ కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే లోక్‌సభ ఎన్నికల్లోనే షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందట. బెంగాల్‌ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే కొత్త కాదు. షమీ కంటే ముందు ఇద్దరు భారత ఆటగాళ్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. మనోజ్‌ తివారీ, అశోక్‌ దిండా రాజకీయాల్లోకి వచ్చారు. మనోజ్ తివారీ టీఎంసీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అశోక్‌ దిండా కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక షమీ కూడా రాజకీయాల్లోకి రావడం పక్కా అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏది ఏమైనా షమీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు దీన్ని కన్ఫర్మ్‌ అయితే చేయలేము.

Next Story