శబరిమల ఆలయంలో సినిమా చిత్రీకరణ జరిగిందన్న వార్తలపై ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (టీడీబీ) స్పందించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో టీడీబీ విజిలెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. సన్నిధానం ప్రాంతంలో మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ వీడియోగ్రఫీ చేసినట్లు ఆరోపణలు రాగా.. దీనిపై టీడీబీ అధికార ప్రతినిధి వివరణ ఇచ్చారు.
వీడియోగ్రఫీకి అనుమతి కోరుతూ మనోహర్ బోర్డును సంప్రదించారని, అయితే అనుమతి లభించలేదని తెలిపారు. శబరిమల యాత్ర సీజన్‌కు ముందు గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ చిత్రీకరణ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తును ప్రారంభిస్తామని తెలిపారు. దర్శకుడు ఎక్కడ చిత్రీకరణ చేశారో తమకు తెలియదన్నారు. తాను సన్నిధానం ప్రాంతంలో వీడియో తీయలేదని, పంపా నది వద్ద చిత్రీకరణ జరిపానని మనోహర్ చెబుతున్నారు.