నేలపైన కాదు.. నీళ్లపైన యోగా చూశారా..?
నీళ్లపై యోగా ఆసనాలు వేయడం అంటే మాత్రం కష్టమైన పనే. కానీ.. యోగా అభ్యాసకులు ఎన్‌జే బోస్, సుదలైకి మాత్రం
By Srikanth Gundamalla Published on 21 Jun 2023 12:35 PM ISTనేలపైన కాదు.. నీళ్లపైన యోగా చూశారా..?
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలో పలు చోట్ల రాజకీయ నాయకులు, ప్రముఖులు యోగా చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అయితే మనం ఇప్పటి వరకు నేలపై వివిధ రకాల యోగా ఆసనాలు వేయడం చూశాం.. మనమూ చేసి ఉంటాం. కానీ నీళ్లలోనూ యోగా ఆసనాలు వేశారు ఇద్దరు యోగా అభ్యాసకులు. నీళ్లలో యోగా చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. తమిళనాడులో జల్‌యోగా పేరుతో యోగా అభ్యాసకుల ఎన్‌జే బోస్, సుదలై నీళ్లలో యోగా ఆసనాలు వేశారు.
నీళ్లలో యోగా చేయడం చాలా ఏళ్ల కిందటి నుంచే ఉందట. నీళ్లలో శ్వాస తీసుకోకుండా యోగా చేస్తుండే వారని చెబుతుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ అయితే యోగా ఆసనాలే వేస్తున్నారు. అయితే..నీళ్లపై యోగా ఆసనాలు వేయడం అంటే మాత్రం కష్టమైన పనే. కానీ.. యోగా అభ్యాసకులు ఎన్‌జే బోస్, సుదలైకి మాత్రం ఇది ఈజీనే. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వీళ్లు ఇద్దరూ నీళ్లలో యోగా చేయడం ఎలాగో చూపించారు. తమిళనాడు రామేశ్వరం వద్ద నీటిలో యోగా ఆసనాలు వేశారు. దాదాపు మూడు గంటల పాటు యోగా చేసి ప్రజలను చైతన్య పరిచారు. నీటిలో యోగా చేయడం ద్వారా శ్వాస వ్యాయామంగా పని చేస్తుందని తెలిపారు. మనసులో శాంతిని నెలకొల్పేందుకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని ఎన్‌జే బోస్, సుదలై తెలిపారు. వీళ్లు నీళ్లలో మూడు గంటల పాటు యోగా చేస్తుండగా అక్కడికి చేరుకుని చాలా మంది తిలకించారు.
#WATCH | Tamil Nadu: Yoga practitioners from Rameswaram perform water yoga to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/rugmjpiygA
— ANI (@ANI) June 21, 2023
కాగా.. ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానం ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి యోగా ఆవశ్యకతను తెలిపేందుకు పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ యోగా చేయాలని ప్రోత్సహిస్తున్నారు.