తమిళనాడులో టోల్‌గేట్ వద్ద ఏపీకి చెందిన లారీ బీభత్సం
తమిళనాడులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. టోల్‌గేట్‌లోకి రాంగ్ రూట్‌లో దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 31 July 2023 10:28 AM ISTతమిళనాడులో టోల్‌గేట్ వద్ద ఏపీకి చెందిన లారీ బీభత్సం
తమిళనాడులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బీభత్సం సృష్టించింది. టోల్‌గేట్‌లోకి రాంగ్ రూట్‌లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
తమిళనాడులోని మధురైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వండియూర్ టోల్‌గేట్ దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. ఏపీకి చెందిన బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ తమిళనాడుకు వెళ్లింది. టోల్‌గేట్ వద్దకు వెళ్లిన తర్వాత లారీ అదుపుతప్పింది. దాంతో.. రాంగ్‌రూట్‌లోకి వెళ్లింది. అక్కడే ఉన్న టోట్‌గేట్ బూత్‌పాయింట్‌ను ఢీకొట్టింది. అప్పటికే ఆగివున్న కారును ఈడ్చుకెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు టోల్‌గేట్‌లోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. లారీ వెళ్లిన తర్వాత అక్కడ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా లారీ దూసుకురావడంతో టోల్‌గేట్ సిబ్బంది అంతా భయపడిపోయారు.
కాగా ప్రమాదంలో టోల్‌గేట్ సిబ్బంది ఒకరు మృతి చెందారు. లారీ వేగంగా దూసుకొస్తుండటాన్ని గమనించిన మరో సిబ్బంది చివరి క్షణంలో అక్కడి నుంచి పరిగెత్తాడు. ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇక లారీ ఈడ్చుకెళ్లిన మరో వాహనంలో నలుగురు ఉన్నట్లు సమాచారం. వారందరికీ తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. స్థానికుల ఫోన్‌కాల్ మేరకు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్ గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయిన టోల్‌గేట్ సిబ్బందిని మార్చురీకి తరలించారు. ప్రమాదం తర్వాత లారీని ఆపిన డ్రైవర్‌ను పట్టుకున్న స్థానికులు.. అతన్ని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించి.. వారు వచ్చాక అప్పగించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బియ్యం లారీ డ్రైవర్‌ను విచారిస్తున్నారు. కాగా.. ఏపీ నుంచి బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దిశలో పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని తమిళనాడు పోలీసులు వెల్లడించారు.