యూట్యూబ్‌లో వీడియో చూసి కాన్పు చేసిన భర్త.. భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో..
యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నం చివరకు ఆమె ప్రాణాలమీదకే తెచ్చింది.
By అంజి Published on 24 Aug 2023 8:09 AM IST
యూట్యూబ్‌లో వీడియో చూసి కాన్పు చేసిన భర్త.. భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో..
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ భర్త.. తన భార్యకు కాన్పు చేశాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న ఆ భర్త ప్రయత్నం బెడిసికొట్టింది. చివరకు భార్య తన ప్రాణాలను కొల్పోవాల్సి వచ్చింది. ప్రసవం తర్వాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. నార్మల్ డెలివరీ కావాలనుకున్న ఆ భార్యభర్తల కోరిక చివరకు విషాదం మిగిల్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు(27) పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకి(27)తో రెండేళ్ల క్రితం మ్యారేజ్ జరిగింది. అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు. ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. దీంతో వారు ప్రసవం కూడా నార్మల్‌గానే జరగాలని నిర్ణయించుకున్నారు.
మొదటి బిడ్డ డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. వారు "ప్రకృతి వైద్యం"ను విశ్వసించారు. అప్పటి నుంచి మాదేశ్ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకునేవాడు. గర్భం దాల్చినంత కాలం భర్త వద్దే ఉంటున్న లోగనాయగి పది రోజుల క్రితం డెలివరీ కోసం కృష్ణగిరిలోని స్వగ్రామానికి వెళ్లింది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు లోగానాయకికి నొప్పి రావడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. అయితే ప్రసవానికి సహకరించిన ఆమె భర్త, కుటుంబ సభ్యులు మాయను తీయడం కష్టమైంది.
ఉదయం 10:30 గంటలకు, వారు ఆమెను పోచంపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. పెరుగోపనపల్లి పీహెచ్‌సీ వైద్యురాలు రాధిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 174(3) కింద కేసు నమోదు చేసినట్లు కృష్ణగిరి ఆర్‌డీఓ ఎస్.బాబు తెలిపారు. విచారణ నిమిత్తం భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి యూట్యూబ్ ఛానెల్‌లలో ఇంటి ప్రసవాలను చూసేవాడని పొరుగువారు చెప్పారు. అభియోగాలు నిర్ధారణ అయితే ఆ వ్యక్తిని అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. శవపరీక్ష అనంతరం ఆసుపత్రి వారు లోగనాయగి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం అప్పగించారు. అప్పుడే పుట్టిన పాప కూడా పోచంపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.