ఓ వైపు పెట్రోల్, వంటగ్యాస్ ధరలు మండిపోతుండగా.. మరో వైపు నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. కూరగాయాల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా టమాటాను సామాన్యుడు కొనే పరిస్థితి లేదు. కిలో టమాటా రూ.130కిపైగా పలుకుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా రూ.150కూడా దాటేసింది. దీంతో ప్రజలు టమాటా వైపు చూడడం మానేశారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ దుకాణాల్లో కిలో టమాటాను రూ.79కే అందించాలని సీఎం స్టాలిన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో టమాటాను రూ.79కే విక్రయించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం నుంచి ప్రభుత్వ దుకాణాల్లో కిలో టమాటా రూ.79కే విక్రయిస్తున్నారు. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లో మరో 65 దుకాణాల్లో ఈ మేరకు విక్రయాలను ప్రారంభించారు. దీంతో ఆయా దుకాణాల వద్ద టమాటాలను కొనుగోలు చేసేందుకు ప్రజలు బారులు తీరారు.