ఆగివున్న రైలులో భారీ అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి

తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  26 Aug 2023 8:46 AM IST
Tamil Nadu, Madurai, Fire accident,  Train,

 ఆగివున్న రైలులో భారీ అగ్నిప్రమాదం, పలువురు మృతి

తమిళనాడులోని మధురై రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్‌లో శనివారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ రైలులో ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోగీలో మంటలు ఎగిసిపడటంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ఐఆర్‌సీటీసీ స్పెషల్‌ రైలులో ఈ ఘటన జరిగింది. మధురై రైల్వే స్టేషన్‌లో ఆగి వున్న ట్రైన్‌లో మంటలు చెలరేగాయి. రైలులోని కిచెన్‌లో సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం అందుతోంది. ఇక గాలులు కూడా వీయడంతో మంటలు బోగీలకు అంటుకున్నాయి. అలా మంటలు ఎగిసిపడి జ్వాలగా కనిపించాయి. తెల్లవారుజామున కావడంతో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. మంటలు చెలరేగిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇక అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు.

కాగా.. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారుగా తెలుస్తోంది. ఇద్దరు మృతుల వివరాలను మాత్రమే అధికారులు ఇప్పటి వరకు సేకరించారు. ఒకరు సప్తమన్ సింగ్‌ (64), మరో మృతురాలు మహిళ మిథిలేశ్వరి(65)గా గుర్తించారు. కాగా.. మరికొందరు కూడా ఈ సంఘటనలో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వారిని ఆస్పత్రికి తరలించి అధికారులు చికిత్స చేయిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటనతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story