తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  18 Dec 2023 11:26 AM IST
tamil nadu, heavy rains, holiday,

 తమిళనాడులో భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు 

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల మిచౌంగ్‌ తుపాను కారణంగా చెన్నై నగరం మొత్తం మునిగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కురుస్తున్న వర్షాలతో తమిళనాడు మరోసారి అతలాకుతలం అవుతోంది. దక్షిణ తమిళనాడుని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తిరునెల్వలి, తూత్తుకుడి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుద్‌నగర్‌ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల జాతీయ రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదేవిధంగా ప్రయివేటు సంస్థలు, బ్యాంకులకు కూడా సెలవులు ఇచ్చారు. తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి, ఎట్టయపురం, విలాతికుళం, కలుగుమలై, కయతార్, కదంబూర్, వెంబర్, సురంగుడి వంటి ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎరతెరిపిలేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. కోవిల్‌పట్టి చుట్టుపక్కల ఉన్న నదులు, సరస్సులు పూర్తిగా నిండుకున్నాయి. పొంగి ప్రవహిస్తున్నాయి. తిరుచెండూరులో అర్ధరాత్రి 1.30 గంటల వరకు 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పాలయంకొట్టయ్‌లో 26 సెం.మీ, కన్యాకుమారిలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సోమవారం కూడా ఇదే తరహాలో ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని చెబుతున్నారు.

మరోవైపు భారీ వర్షాల ప్రభావంతో రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు రైళ్లు, విమానాలను రద్దు చేశారు అధికారులు. పలు చోట్ల రైల్వే ట్రాకులపై భారీగా నీరు నిలిచిపోయింది. వందేభారత్ సహా 17 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. తూత్తుకుడి నుంచి రాకపోకలు సాగించే విమానాలను దారి మళ్లించారు. అలాగే కొన్నింటిని రద్దు చేశారు అధికారులు.



Next Story