నాలుగు సంవత్సరాల తర్వాత దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తమిళనాడులో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే..! అన్నాడీఎంకే పార్టీ తనదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను ప్రజా జీవితంలో ఉంటానని, క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. తాను ఎవరికీ భయపడనని అన్నారు. తనను వ్యతిరేకించిన వారికి తనేమిటో అర్థమయి ఉంటుందని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ నేతలు వణికిపోతున్నారని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ తనదేనని అన్నారు. అమ్మ వారసత్వాన్ని తాను కొనసాగిస్తానని చెప్పారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే తమిళనాడు ప్రభుత్వం పెద్ద షాక్ ను ఇచ్చింది. శశికళ అడుగుపెట్టిన వెంటనే ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శశికళ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తునకు సంబంధించి 2017లో సుప్రీంకోర్టు తీర్పునివ్వగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న 800 ఎకరాల భూములను ప్రభుత్వం జప్తు చేసింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లు విలువ చేసే భూములను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. జప్తు చేసిన ఆస్తులన్నీ ఇలవరసి, సుధాకరన్ పేరుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కక్షపూరితంగా తీసుకున్న చర్యలు అంటూ శశికళ వర్గం ఆరోపిస్తూ ఉంది.