గుజరాత్‌లోని భూపేంద్ర పటేల్ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. 'దేవభూమి ద్వారకా కారిడార్'లో భాగంగా ద్వారకా నగరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిర్మించనున్నట్లు గుజరాత్ ప్రభుత్వం గురువారం తెలిపింది. దీని మొదటి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. గురువారం గాంధీనగర్‌లో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం గుజరాత్ ఆరోగ్య మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి హృషికేష్ పటేల్ ఈ విషయాన్ని ప్రకటించారు.
ద్వారకాధీష్ ఆలయానికి ప్రసిద్ధి చెందిన దేవభూమి ద్వారకలో గుజరాత్‌లోని అత్యంత ఎత్తైన కృష్ణుడి విగ్రహాన్ని స్థాపించడమే కాకుండా, 3డీ ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ జోన్, శ్రీమద్ భగవద్గీత ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను కూడా అందుబాటులోకి తెనున్నారు. ఈ ప్రాంతాన్ని పశ్చిమ భారతదేశంలోనే అతిపెద్ద మత కేంద్రంగా మార్చేందుకు 'దేవభూమి ద్వారకా కారిడార్'ను అభివృద్ధి చేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించిందని హృషికేశ్ పటేల్ చెప్పారు.
వచ్చే ఏడాది సెప్టెంబరులో భూమి పూజ..
మంత్రి హృషికేశ్ పటేల్ మాట్లాడుతూ.. ''ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో, పురాతన నగరమైన ద్వారక అవశేషాలను ప్రజలు చూడగలిగే వీక్షణ గ్యాలరీని కూడా నిర్మించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసిన తర్వాత మొదటి దశ పనులను ప్రారంభించాలని మేము భావిస్తున్నాము'' అని చెప్పారు.