ప్రపంచంలోని అద్భుతమైన కట్టడాల్లో ఒకటిగా నిలిచిన ఆగ్రాలోని తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈ బెదిరింపుతో తాజ్‌మహల్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోజు ఉదయం తాజ్‌మహల్ లో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు తాజ్‌మహల్‌ను తాత్కాలికంగా మూసి వేసి.. పర్యాటకులను బయటకు పంపించివేశారు. అనంతరం స్పెషల్ బాంబ్ స్క్వాడ్, డాగ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించ లేదు. ఇది కేవలం బెదిరింపు కాల్ మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
కాగా.. దీనిపై ఆగ్రా ఎస్పీ శివరామ్ యాదవ్ మాట్లాడుతూ.. సైనిక నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని.. తనకు సైనిక నియామకాల్లో ఉద్యోగం రాలేదని.. అందుకే తాజ్‌మహల్ లో బాంబు పెట్టానని.. త్వరలో అది పేలుతుందని ఓ వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి చెప్పాడని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడకు చేరుకుని పర్యాటకులను బయటకు పంపి విస్తృత తనిఖీలు చేపట్టారన్నారు. కాగా.. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అది నకిలీ బెదిరింపు కాల్‌గా నిర్థారించారు. ఫిరోజాబాద్‌కు చెందిన వ్యక్తి ఈ కాల్ చేసినట్లు గుర్తించారు. ఈ బెదిరింపు కాల్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వివరించారు.