తాజ్ మహల్.. ప్రేమకు చిహ్నాం. ప్రతి సంవత్సరం ఎంతో మంది ఈ చారిత్రక కట్టడాన్ని దర్శించుకుంటారు. 370 ఏళ్ల చరిత్ర గల తాజ్‌మహల్‌కు నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలంటూ నోటీసులు పంపారు అధికారులు. నిర్ణీత సమయంలోగా బిల్లులు చెల్లించకుంటే సీజ్ చేస్తామని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కి నోటీసులు పంపారు.
తాజ్‌మహల్‌కు రెండు నోటీసులు, ఆగ్రా ఫోర్ట్‌కు ఒక నోటీసు అందినట్లు ఏఎస్ఐ అధికారి రాజ్ కుమార్ పటేల్ తెలిపారు. అయితే ఇదేదో పొరబాటుగా జరిగి ఉంటుందన్నారు. ఎందుకంటే పురాతన, చారిత్రక కట్టడాలకు పన్నులు వర్తించవన్నారు. తాజ్ మహల్‌కు ఆస్తి పన్ను వర్తించదన్నారు. ఇక నీటిని కూడా ఎలాంటి వాణిజ్య ప్రమోజనాల కోసం వాడటం లేదన్నారు. కేవలం తాజ్ మహల్‌లోని లాన్ల కోసమే వినియోగిస్తున్నామని దీనికి ఎలాంటి బిల్లు జారీ కాదన్నారు.
ప్రపంచ వారసత్వ సంపద అయిన తాజమహల్, ఆగ్రా ఫోర్ట్‌కు కంటోన్మెంట్ బోర్డు తమకు నోటీసు ఇచ్చింది. రూ. 5 కోట్లకు పైగా చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. చట్టం ప్రకారం స్మారక చిహ్నాలకు నీటిబిల్లు, ఆస్తి పన్ను మినహాయించిన విషయాన్ని బోర్డుకు గుర్తు చేశాం అని ఏఎస్ఐ అధికారి రాజ్ కుమార్ పటేల్ తెలిపారు.