అంబులెన్స్ సేవలను ప్రారంభించిన స్విగ్గీ.. వారి కోసమే
Swiggy Announces Ambulance Service for Delivery Executives, Dependents. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ.. అంబులెన్స్ సేవలను ప్రారంభించింది.
By అంజి Published on 17 Jan 2023 5:19 AM GMTప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ.. అంబులెన్స్ సేవలను ప్రారంభించింది. అయితే ఈ సేవలు తన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల కోసం, అత్యవసర పరిస్థితుల్లో వారిపై ఆధారపడిన వారి కోసం మాత్రమేనని తెలిపింది. ఫోన్ చేసినా 12 నిమిషాల్లోనే అంబులెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశామని స్విగ్గీ పేర్కొంది. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు టోల్-ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా ఉచిత అంబులెన్స్ సేవను యాక్సెస్ చేయడానికి డెలివరీకి ముందు, డెలివరీ సమయంలో లేదా తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పార్టనర్ యాప్‌లో ఎస్‌ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా అంబులెన్స్ వారి వద్దకు వస్తుందని స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది.
2020-21లో 77 లక్షల మంది కార్మికులు భారతదేశ గిగ్ ఎకానమీలో నిమగ్నమై ఉన్నారని, 2029-30 నాటికి 2.35 కోట్ల మంది కార్మికులకు విస్తరిస్తారని ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ అధ్యయనం ఇటీవల అంచనా వేసింది. డెలివరీ బాయ్‌లు, క్లీనర్‌లు, కన్సల్టెంట్‌లు, బ్లాగర్‌లు మొదలైన వారంతా గిగ్ ఎకానమీలో భాగమే. అయితే వీరూ.. సామాజిక భద్రత, గ్రాట్యుటీ, కనీస వేతన రక్షణ,పని గంటలకు సంబంధించిన అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. అందుకోసమే వీరికి సాయం చేసేందుకు ఈ అంబులెన్స్ సేవలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియకు ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు వారి ఐడీ నెంబర్ చెబితే సరిపోతుందని స్విగ్గీ తెలిపింది.
"బెంగళూరు, ఢిల్లీ, ఎన్‌సీఆర్, హైదరాబాద్, ముంబై, పూణే, కోల్‌కతాలో ఈ సేవలను అందుబాటులోకి వస్తాయి. స్విగ్గీ అందించిన బీమా కింద కవర్ చేయబడిన యాక్టివ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లందరికీ, వారిపై ఆధారపడిన వారికి (భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు) ఈ సేవ ఉచితం. డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తమ బీమా పరిధిలోకి రాని కుటుంబ సభ్యుల కోసం అంబులెన్స్‌ని పొందేందుకు దీనిని ఎంచుకోవచ్చు" అని స్విగ్గీ పేర్కొంది.