స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 May 2024 3:01 PM IST
స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్ట్
ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన పోలీసులు బిభవ్ కుమార్‌ను అక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని వెనుక గేటు నుంచి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. సీఎం నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి మాలివాల్ పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు.
స్వాతి మాలివాల్ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు.. రెండు రోజుల తర్వాత బిభవ్‌ను అరెస్ట్ చేశారు. కాగా.. ఈ కేసులో స్వాతి మాలివాల్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
సోమవారం రోజు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో తాను వెళ్లినప్పుడు.. ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశాడని స్వాతి మాలివాల్ ఆరోపించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులకు మాలివాల్ కీలక విషయాలను వెల్లడించింది. తాను సీఎం కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లాననీ.. ఆ సమయంలో తనపైకి ఒక్కసారిగా బిభవ్ కుమార్ దూసుకొచ్చాడని చెప్పింది. ఈ క్రమంలోనే ఏడెనిమిది సార్లు బలంగా కొట్టాడని అన్నది. తనని లాగేయడంతో టేబుల్‌కు తల బలంగా తగిలి కిందపడిపోయినట్లు వెల్లడించింది. కావాలని తన చొక్కాను పైకి లాగాడనీ.. దాంతో గుండీలన్నీ ఊడిపోయానని స్వాతి మాలివాల్ ఆరోపించింది.
అంతటితో ఆగకుండా పొత్తి కడుపు, చాతిపై తన్నడంతో గాయపడ్డానని స్వాతి మాలివాల్ చెప్పింది. తన ఆరోగ్యం బాగోలేదని.. భరించలేకపోతున్నానని చెప్పినా వినకుండా దాడికి పాల్పడ్డాడని స్వాతి మాలివాల్ తన వాంగ్మూలంలో పోలీసులతో చెప్పింది. రోవైపు సీఎం నివాసంలోకి అనధికారికంగా ప్రవేశించిందుకు మాలివాల్ ప్రయత్నించారనీ.. తనని దూషించిందంటూ బిభవ్ స్వాతిపై ఆరోపణలు చేశాడు. తాను కూడా పోలీసులకు కంప్లైంట్ చేశాడు.