ఎంపీ పదవికి రాజీనామాపై స్వాతి మాలివాల్ ఆసక్తికర కామెంట్స్
ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంఘటనల్లో.. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఒకటి.
By Srikanth Gundamalla
ఎంపీ పదవికి రాజీనామాపై స్వాతి మాలివాల్ ఆసక్తికర కామెంట్స్
ఇటీవల దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంఘటనల్లో.. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఒకటి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లినప్పుడు ఆయన పీఏ బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. మే 13న ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత స్వాతి మాలివాల్ ఫిర్యాదుతో సీఎం నివాసంలోనే బిభవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.
ఈ పరిణామాల తర్వాత ఆప్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాతి మాలివాత్ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆప్ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న తాను పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా అభ్యర్ధిస్తే పదవి నుంచి వైదలిగేదాన్ని అని చెప్పారు. కానీ.. అలా కాకుండా దాడి చేయడంతోనే ఇప్పుడు పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు ఎంపీ స్వాతి మాలివాల్.
ఆప్‌ను స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని స్వాతి మాలివాల్ పేర్కొన్నారు. 2006లో వీరితో కలిసి పనిచేసేందుకు వీలుగా తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నట్లు గుర్తు చేశారు. అప్పుడు తమ సంస్థలో ముగ్గురే ఉండేవారనీ.. వారిలో తాను కూడా ఒకరని చెప్పారు. ఎవరికైనా తన రాజ్యసభ సీటు కావాలంటే తనని అడగాలని చెప్పారు. పార్టీ కోసం జీవితాన్నే ఇచ్చాననీ..ఎంపీ సీటు చాలా చిన్న విషయంగా చెప్పారు స్వాతి మాలివాల్. తాను పార్టీలో చేరిన్నప్పటి నుంచి ఎలాంటి పదవీ కోరలేదన్నారు. కానీ.. వారు తనతో దారుణంగా ప్రవర్తించడం బాధగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఎంపీ పదవికి రాజీనామా చేయబోను అని మరోసారి స్పష్టంగా చెప్పారు.