పెరిగిన నీటి మ‌ట్టం.. నిలిచిపోయిన స‌హాయ‌క చ‌ర్య‌లు

Surge in water level of dhauli ganga rescue work at tapovan tunnel halted temporarily.ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని త‌పోవ‌న్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2021 10:58 AM GMT
Surge in water level of dhauli ganga rescue work at tapovan tunnel halted temporarily

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలోని త‌పోవ‌న్ విద్యుత్తు కేంద్రం సొరంగంలో కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. చ‌మోలీ జిల్లాలో రిషి గంగ న‌ది నీటి మ‌ట్టం పెర‌గ‌డంతో.. సొరంగంలో చిక్కుకున్న వారి కోసం గ‌త నాలుగు రోజులుగా కొన‌సాగుతున్న స‌హాయ‌క చ‌ర్య‌ల్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి బ‌దౌరియా వెల్ల‌డించారు. సొరంగం లోప‌ల ప‌నిలో ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందితో పాటు అక్క‌డ డ్రిల్లింగ్ చేసేందుకు ఉంచిన భారీ యంత్రాల‌ను అధికారులు సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు.


ఈ సొరంగంలో చిక్కుకున్న 25 నుంచి 35 మంది కోసం అన్వేష‌ణ కొన‌సాగిస్తున్నారు. లోప‌ల ఉన్న‌వారిని రక్షించేందుకు పూడుకుపోయిన మ‌ట్టికే రంధ్రాలు చేసి ఆక్సిజ‌న్‌ను పంపించాల‌ని చూస్తుండ‌గా.. మ‌రోసారి న‌దిలో నీటిమ‌ట్టం పెర‌గ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. మ‌రోవైపు 1500 మీట‌ర్ల పొడ‌వు గ‌ల సొరంగంలో బుధవారం నాటికి 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించినట్లు తెలుస్తోంది. బుర‌ద, నీరు కొట్టుకుని వ‌స్తుండ‌డంతో స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం ఇబ్బందిక‌రంగా మారింది.

ఆదివారం ఉత్తరాఖండ్ లో జల విలయం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. జోషిమఠ్‌ వద్ద నందాదేవీ హిమానీనదం కట్టలు తెంచుకోవడం వల్ల చమోలీ జిల్లా రేనీ తపోవన్‌ వద్ద రిషి గంగా నదికి ఆకస్మిక వరదలు సంభవించాయి. రెండు జల విద్యుత్​ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. జలవిలయం కారణంగా ఇప్పటి వరకు 35మంది మరణించగా.. మ‌రో 172 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. స‌మ‌యం గ‌డిచేకొద్ది కుటుంబ స‌భ్యుల్లో ఆశ‌లు స‌న్న‌గిల్లుతుండ‌డంతో మ‌రింత ఆందోళ‌న నెల‌కొంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు. ఐటీబీపీ అధికారులతో సహాయక చర్యలపై చర్చించారు.
Next Story
Share it