ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.

By Srikanth Gundamalla  Published on  11 Dec 2023 11:54 AM IST
Supreme Court,  Article 370, delhi,

 ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019 ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది.

ఈ మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే పార్లమెంట్‌ నిర్ణయాన్ని కూడా కొట్టిపారేయలేము అని పేర్కొంది సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం. కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 370 అనేది యుద్ధం నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమే అని సుప్రీంకోర్టు పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు సార్వభౌమాధికారం లేదని.. భారత రాజ్యాంగమే ఫైనల్ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీంకోర్టు వివరించింది. ఈ మేరకు పిటిషనర్ల వాదనలను తోసి పుచ్చింది.

ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్‌ వరకు ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. సెప్టెంబర్‌ 5నే రిజర్వులో ఉంచిన తీర్పును తాజాగా వెల్లడించింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్రం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ మేరకు దీనిని స్థానిక పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయా పార్టీలు పిటిషన్లు వేశాయి. కీలక తీర్పు వెలువడ్డ నేపథ్యంలో కశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నారు. రెండువారాలు కశ్మీర్‌లో పోలీసులు అలర్ట్‌గా ఉంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలన హౌస్ అరెస్ట్‌ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story