సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఇక అంతే: సుప్రీంకోర్టు

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారికి సుప్రీంకోర్టు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2023 6:00 AM GMT
Supreme Court, Social Media,  Delhi,

 సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఇక అంతే: సుప్రీంకోర్టు

సోషల్‌ మీడియా వచ్చాక సమాచారం వేగంగా అందుతోంది. కానీ.. వాటిల్లో ఏది వాస్తవాలో.. ఏది అవాస్తవమో తెలియడం లేదు. ఈ క్రమంలో కొందరు అయితే.. విచ్చలవిడిగా అభ్యంతరకర పోస్టులను పెడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారికి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ ఈ వ్యాఖ్యలు చేసింది. పోస్టు పెట్టిన తర్వాత తప్పు అయిపోయిందంటూ క్షమాపణ చెబితే సరిపోదని.. క్రిమినల్ కేసులను తప్పించుకోలేరంటూ వ్యాఖ్యానించింది. అభ్యంతరకర పోస్టు పెట్టడం ద్వారా అవతలి వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలని హితవు పలికింది.

తమిళనాడు మాజీ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఫేస్‌బుక్‌లో ఓ అభ్యంతరకర పోస్టును మాజీ ఎమ్మెల్యే శేఖర్ షేర్ చేశారు. దీనిపై స్పందించిన మహిళా జర్నలిస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో.. శేఖర్‌పై పోలీసులు చెన్నై కమిషనరేట్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే శేఖర్ చెన్నై కోర్టుని ఆశ్రయించారు. తనపై నమోదు అయ్యిన కేసును కొట్టేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తిని చెన్నై కోర్టు తిరస్కరించింది. దాంతో.. శేఖర్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

శేఖర్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా.. సుప్రీంకోర్టులో ఆయన తరఫు లాయర్‌ ఇలా వాదించారు. 2018 ఏప్రిల్ 20న తన క్లయింట్ కళ్లల మందు వేసుకోవడం వల్ల ఫేస్‌బుక్‌లో ఉన్న పోస్టుని సరిగా చదవకుండానే షేర్ చేశాడని పేర్కొన్నాడు. అయితే.. అభ్యంతరకరంగా ఆ పోస్టు ఉందని గమనించిన రెండు మూడు గంటల్లోనే తొలగించాడని వాదించారు. బాధితురాలికి, జర్నలిస్ట్‌ సంఘానికి కూడా క్షమాపణలు చెప్పాడని తెలిపారు. పొరపాటున జరిగింది కాబట్టి క్రిమినల్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో శేఖర్ తరఫు లాయర్‌ కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని.. పోస్టు పెట్టేసి తర్వాత క్షమాపణ చెబితే సరిపోదని వ్యాఖ్యానించింది. పోస్టు పెట్టిన తర్వాత పర్యావసనాలను ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేసింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే శేఖర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

Next Story