'రిజర్వేషన్ల కోసం హిందువునంటే ఒప్పుకోం'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వేరే మతాన్ని పాటిస్తూ.. కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

By అంజి  Published on  28 Nov 2024 2:24 AM GMT
Supreme Court,  Religious Conversion, Quota Benefits

'రిజర్వేషన్ల కోసం హిందువునంటే ఒప్పుకోం'.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వేరే మతాన్ని పాటిస్తూ.. కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇది పూర్తిగా భారత రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు ఎస్సీ ధ్రువీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఉద్యోగ ప్రయోజనాల కోసం సదరు మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని ద్విసభ్య ధర్మాసనం 21 పేజీల తీర్పులో తప్పుబట్టింది.

జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ ఆర్‌. మహాదేవ్‌ల ఇచ్చిన తీర్పులో కీలక అంశాన్ని ప్రస్తావించింది. ''మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం అయితే అనుమతించం. అలాంటి ఉద్దేశాలు ఉన్నవారికి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తే అది రిజర్వేషన్ల స్పూర్తికే విరుద్ధం'' అని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటిషనర్‌ క్రైస్తవ మతాన్ని నమ్ముతున్నారని, చర్చికి వెళ్తున్నారని సాక్ష్యాల ద్వారా నిర్దారణ అయ్యిందని ధర్మాసనం తెలిపింది. పిటిషనర్‌ ఎక్కడా హిందూ మతంలోకి చేరినట్టు ఆధారాలు సమర్పించలేదని కోర్టు తెలిపింది.

ఆమె కులమైన వల్లువన్‌ సమూహ అంగీకారాన్ని పొందినట్టు కూడా దాఖలాలు లేవని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులోని పిటిషన్‌ హిందూ తండ్రికి, క్రిస్టియన్‌ తల్లికి జన్మించారు. 2015లో ఓ ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని, తన తండ్రి ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అంటూ ఎస్సీ ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా.. స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ఆమె హైకోర్టులో సవాల్‌ చేయడంతో అక్కడ కూడా ప్రతికూలంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కింది.

Next Story