'మీరేం అమాయకులు కాదు'.. మరోసారి రామ్‌దేవ్‌ బాబాకి సుప్రీంకోర్టు మందలింపు

ధిక్కార కేసును విచారిస్తున్న సందర్భంగా యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

By అంజి  Published on  16 April 2024 1:30 PM GMT
Supreme Court, yoga guru Ramdev, Patanjali Ayurved

'మీరేం అమాయకులు కాదు'.. మరోసారి రామ్‌దేవ్‌ బాబాకి సుప్రీంకోర్టు మందలింపు

పతంజలి ఆయుర్వేద్ కంపెనీ ఔషధ ఉత్పత్తులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి ధిక్కార కేసును విచారిస్తున్న సందర్భంగా యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అతని "బాధ్యతా రహిత ప్రవర్తన"పై కూడా కోర్టు విమర్శించింది. రామ్‌దేవ్‌ బాబా "అంత అమాయకుడు కాదు" అని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 23న జరుగుతుందని న్యాయమూర్తులు హిమా కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

కోర్టుకు భౌతికంగా హాజరైన రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఒక వారం గడువు కూడా ఇచ్చింది. తాము చేసిన తప్పులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని యోగా గురు కోర్టుకు తెలిపారు. ''ఆ సమయంలో మేం చేసింది కరెక్ట్ కాదు.. భవిష్యత్తులోనూ దాన్ని గుర్తు పెట్టుకుంటాం'' అని అన్నారు. అయితే ధర్మాసనం "చట్టం అందరికీ సమానం. మీరు ఏమి చేసినా, మీ అండర్ టేకింగ్, మా ఆదేశాన్ని అనుసరించి మీరు ఇదంతా చేసారు. మీరు నయం చేయలేని వ్యాధుల గురించి ప్రచారం చేయలేరని మీకు తెలుసా?" అని ప్రశ్నించింది.

దీనికి రామ్‌దేవ్ బదులిస్తూ తాము చాలా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కాగా "ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. మీ మునుపటి చరిత్ర దెబ్బతింటుంది. మీ క్షమాపణను అంగీకరించాలా వద్దా అనే దాని గురించి మేము ఆలోచిస్తాము. మీరు పదేపదే ఉల్లంఘనలు చేసారు. మీకు పూర్తిగా తెలియనంత అమాయకులు కాదు'' అని ధర్మాసనం పేర్కొంది. తన వంతుగా జస్టిస్ అమానుల్లా మాట్లాడుతూ.. మీ (రామ్‌దేవ్‌ బాబా) క్షమాపణ మీ హృదయం నుండి రావడం లేదు అని అన్నారు.

ఏప్రిల్ 10న, సుప్రీంకోర్టు బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణల "బేషరతు క్షమాపణ" ను తోసిపుచ్చింది , వారి చర్యలు "ఉద్దేశపూర్వకంగా దేపదే ఉల్లంఘించాయి అని పేర్కొంది. పతంజలి ఆయుర్వేదంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిటిషన్ దాఖలు చేసింది.

ఏప్రిల్ 10న విచారణ సందర్భంగా, జస్టిస్ కోహ్లి, అమానుల్లాలతో కూడిన అదే ధర్మాసనం పతంజలి ఆయుర్వేదంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. "కోర్టు ధిక్కార చర్యలను తేలికగా తీసుకుంటోందని" విమర్శించింది. అఫిడవిట్‌లో చెప్పిన దానితో తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది.

పతంజలి ఉత్పత్తులకు లైసెన్స్‌ను అందించినందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని "మీరు చేస్తున్న పనిలో మీకు అంత దమ్ము ఉందా? మీరు పోస్టాఫీసులా వ్యవహరిస్తున్నారు" అని ప్రశ్నించింది. "అధికారులకు 'బోనఫైడ్' అనే పదాన్ని ఉపయోగించడంపై మాకు తీవ్ర అభ్యంతరం ఉంది. మేము తేలికగా తీసుకోబోవడం లేదు. మేము మిమ్మల్ని చీల్చివేస్తాము" అని జస్టిస్ అమానుల్లా అన్నారు.

Next Story