మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో సుప్రీం కోర్టు నేడు(బుధవారం) కీలక ఆదేశాలిచ్చింది. ఈ కేసులో మూడు దశాబ్ధాలకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న దోషి ఎ.జి.పేరరివాళన్ ను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో యావజ్జీవ ఖైదీలలో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పెరారివాలన్‌ను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తోన్న నళిని, ఆమె భర్త మురుగన్ సహా ఇతర దోషుల విడుదలకు కూడా మార్గం సుగమం కానుంది.
మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో రాజీవ్ గాంధీని ధను అనే మహిళా ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ హత్య కేసులో మురుగన్, అతని భార్య నలిని, పెరరివళన్, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్‌లకు దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి మరణశిక్ష విధించింది. అయితే.. వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీం కోర్టు వారిన జీవిత ఖైదీలుగా మార్చింది.అయితే ఈ ఏడుగురిని విడుదల చేయాలనే గతంలో తమిళనాడు మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసింది.