సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు.. స‌హ‌జీవ‌నాన్ని అత్యాచారంగా భావించ‌లేం

Supreme Court On Marital Rape.సహజీవనం చేసిన వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, పెళ్లిచేసుకోడానికి నిరాకరించడాన్ని అత్యాచారంగా భావించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2021 10:53 AM GMT
Supreme Court On Marital Rape

వైవాహిక అత్యాచారం గురించి సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేసిన వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, పెళ్లిచేసుకోడానికి నిరాకరించడాన్ని అత్యాచారంగా భావించలేమని కీలక వ్యాఖ్యలు చేసింది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే పెళ్లి పేరిట తప్పుడు వాగ్దానాలు చేయడం సరికాదని తేల్చింది. రెండేళ్ల క్రితం నాటి కేసు విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 'కలిసి జీవించిన జంట.. భర్త క్రూరుడే అయినా శృంగారంలో పాల్గొనడాన్ని అత్యాచారం అంటారా?'అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రశ్నించారు.

వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి గతంలో ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రెండేళ్ల అనంతరం వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి పేరిట తనను మోసగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దిగువ కోర్టులో తనకు న్యాయం జరగడం లేదని భావించిన వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరస్పర అంగీకారంతోనే తాము ఒక్కటయ్యామని, ఇందులో తన తప్పేమీ లేదని, కాబట్టి బెయిలు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేయగా, సోమవారం విచారణకు వచ్చింది.

పెళ్లి చేసుకుంటానని అసత్యపు ప్రమాణాలు చేయడం తప్పు. పురుషులైనా, మహిళలు అయినా ఎవరూ ఇలాంటి పనిచేయకూడదు.'పెళ్లి విషయంలో మోసపూరిత హామీ ఇవ్వడం తప్పు. మహిళ గానీ, పురుషుడు గానీ ఎవరూ అలా చేయకూడదు. మహిళ సైతం అటువంటి వాగ్దానం చేయకూడదు.. కానీ, సహజీవనం చేసి, శృంగారంలో పాల్గొనడాన్ని రేప్‌ అని ఎలా చెబుతారు?' అని నిలదీసింది. ఈ విషయమై గతంలోనే స్పష్టమైన తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ సందర్భంగా బాధితురాలి తరఫున లాయర్ మాట్లాడుతూ.. నిందితుడు శారీరకంగా హింసించాడని, ప్రయివేట్ భాగాలపై దాడిచేయడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.ఈ సమయంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. 'అప్పుడు మీరు దాడి, గృహ హింస కేసు పెట్టాలి. అత్యాచార కేసు ఎందుకు పెట్టారు?' అని ప్రశ్నించింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ''వాళ్లిద్దరూ కలిసి ఉన్న సమయంలో ఇష్టప్రకారమే శృంగారంలో పాల్గొన్నారు. నిజానికి పెళ్లి కూడా చేసుకోలేదు. అది కేవలం ఓ బంధం మాత్రమే'' అని వాదించారు. బాధితురాలి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ''పెళ్లి పేరుతోనే బాధితురాలిపై అత్యాచారం చేశాడు. మనాలిలోని ఓ ఆలయంలో పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అ‍త్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మెడికల్‌ రిపోర్టులు కూడా ఉ‍న్నాయి'' అని న్యాయస్థానానికి తెలిపారు. వినయ్‌ న్యాయవాది.. బాధితురాలికి మరో ఇద్దరు వ్యక్తులతో సంబంధం ఉందంటూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కోర్టు.. ''మీరు ఇలా మాట్లాడకూడదు. ఆమె బాధితురాలు'' అని స్పష్టం చేసింది. అనేక వాదోపవాదాల అనంతరం ఎట్టకేలకు నిందితుడికి అరెస్టు నుంచి ఎనిమిది వారాల పాటు రక్షణ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్‌ బెయిలుకు అప్లై చేసుకోవాల్సిందిగా ఆదేశించింది.


Next Story
Share it