ఆస్పత్రుల్లో చికిత్సలకు ఫీజులపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

By Srikanth Gundamalla  Published on  28 Feb 2024 9:35 AM GMT
supreme court,  hospital charges, central govt ,

ఆస్పత్రుల్లో చికిత్సలకు ఫీజులపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 

పేదల కోసం ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా వైద్యంలో వివిధ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలకు అయ్యే ఖర్చులపై వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయినా.. కూడా పేదలకు వైద్యం భారంగానే మారుతోంది. ప్రభుత్వ, ప్రయివేట్‌ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చుల్లో గణనీయమైన వ్యత్యాసాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వివిధ ప్రాంతాల జీవన ప్రమాణాలకు అనుగుణంగా వైద్య చికిత్సలకు ప్రామాణిక రేటును నిర్ధారించే క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది.

స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్, 2012లోని రూల్‌ 9 ప్రకారం రోగులకు ఆస్పత్రుల్లో ప్రతి వైద్యానికి ప్రామాణిక ఫీజు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. ఇందులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఈ రూల్‌ ప్రకారం అందించాల్సిన చికిత్సల ఖర్చు వివరాలను ఆస్పత్రుల్లో స్థానిక భాషల్లో ప్రచురించి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాల్తో సంప్రదింపులు జరిపి ప్రతి వైద్యానికి అయ్యే ఖర్చు వివరాలను ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇక దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది.. రాష్ట్రప్రభుత్వాలతో ఇదే విషయంపై పలుమార్లు చర్చలు జరిగాయని.. కానీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు.. నెల రోజుల లోపు స్టాండర్డ్‌ రేట్లను నోటిఫై చేసేలా అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోకపోతే.. పిటిషనర్‌ కోరికమేరకు సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ సూచించిన ప్రామాణిక రేట్లను అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

Next Story