సహజీవనం చేస్తే పోక్సో చట్టం కింద శిక్షలా..?
Supreme Court notice to Tamil Nadu government.సహజీవనం చేస్తూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న వారిపై ఫోక్సో చట్టం కింద శిక్ష విధించాలా.
By తోట వంశీ కుమార్ Published on 28 March 2021 1:33 PM ISTసహజీవనం చేస్తూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న వారిపై ఫోక్సో చట్టం కింద శిక్ష విధించాలా..? వద్దా..? అనే అంశంపై స్పందించాల్సింగా తమిళనాడు ప్రభుత్వాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఓ యువకుడితో ఏకాభిప్రాయంతోనే సహజీవనం చేసినట్టు స్పష్టం చేసినప్పటికీ.. యువతి వాదనలను మద్రాసు హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.
ఏం జరిగిందంటే..?
తమిళనాడుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే.. ఆమెతో పెళ్లి అతడు నిరాశకరించాడు. దీంతో ఆయువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే విచారణ సందర్భంగా.. తనపై అత్యాచారం జరగలేదని, ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నట్లు యువతి వెల్లడించింది. తిరిగి ఆ యువకునితో సహజీవనం కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. యువతి వాదనలను తిరస్కరించిన కింది కోర్టు.. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.5 వేల జరిమానా విధించింది. యవతికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.
కొన్ని పరిణామాల అనంతరం ఈ అంశం మద్రాసు హైకోర్టుకు చేరింది. హైకోర్టులో యువతి, యువడకుడు ఒకే వాదనలు వినిపించారు. తమ సంబంధం పరస్పర అంగీకారంతో కూడినదని మద్రాసు హైకోర్టు ఎదుట యువతి సాక్ష్యమిచ్చింది. ఆ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆమె పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.