స్మోకింగ్ ఏజ్‌ను పెంచాలంటూ పిటిషన్.. ఇలాంటి పిటిషన్‌లు వద్దన్న సుప్రీంకోర్టు
Supreme Court junks plea to increase smoking age. భారత్‌లో స్మోకింగ్ ఏజ్ 18 ఏళ్లుగా ఉంది. 18 ఏళ్ల వయస్సు లోపువారు స్మోకింగ్ చేస్తే చట్టరీత్యా నేరం.
By అంజి Published on 22 July 2022 3:48 PM ISTభారత్‌లో స్మోకింగ్ ఏజ్ 18 ఏళ్లుగా ఉంది. 18 ఏళ్ల వయస్సు లోపువారు స్మోకింగ్ చేస్తే చట్టరీత్యా నేరం. అయితే ఈ రోజుల్లో స్మోకింగ్ చాలా కామన్ అయిపోయింది. వయస్సుతో పని లేకుండా చాలా మంది స్మోకింగ్ చేస్తున్నారు. ధూమపానం చేసే వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని, అలాగే లూజ్ సిగరెట్ల అమ్మకాలని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం నాడు కొట్టేసింది. ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.
"మీకు ప్రచారం కావాలంటే మంచి కేసు వాదించండి.. ఇలాంటి పనికిరాని పిటిషన్‌లు వేయకండి' అని పేర్కొంటూ ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే స్మోకింగ్‌ను నియంత్రించేందుకు కొన్ని మార్గదర్శకాలను ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు శుభమ్ అవస్థి, సప్త రిషి మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. విద్యా, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, ప్రార్థనా స్థలాల సమీపంలో లూజ్ సిగరెట్ల అమ్మకాలను నిషేధించడంతో పాటు వాణిజ్య ప్రదేశాల నుండి స్మోకింగ్ జోన్‌లను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా పిటిషన్ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.
స్మోకింగ్ చేయడం వల్ల వచ్చే కొద్ది క్షణాల మత్తు కోసం తమ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వారి ఆరోగ్యానికి హాని తలపెడుతున్నారు. ఒకర స్మోకింగ్ చేస్తుంటే పక్కనున్నవారు ఆ పొగను పీల్చుతుంటారు. ఇలా పీల్చేవారిని సెకండ్ హ్యాండ్ స్మోకర్స్ అంటారు. స్మోకింగ్‌కు కంటే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ చాలా ప్రమాదకరం. సిగరెట్ కాలుతున్నప్పుడు వచ్చే పొగ, సిగరెట్ తాగిన వ్యక్తి వదులుతున్న పొగ, ఈ రెండింటి మిశ్రమ పొగను పాసివ్ స్మోకర్లు పీలుస్తారు. సర్జన్ జనరల్ నివేదిక ప్రకారం 1964 నుంచి ఇప్పటివరకు దాదాపు పాతికలక్షల మంది సెకండ్ హ్యాండ్ స్మోకర్లు మరణించారు.