జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జల్లికట్టును నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 May 2023 8:45 AM GMTజల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తమిళనాడు సంప్రదాయక ఆట జల్లికట్టుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జల్లికట్టును నిషేదించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం జల్లికట్టుపై ఎలాంటి నిషేదం లేదని 2017లో తమిళనాడు సర్కార్ చేసిన చట్టానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టుపై ఎలాంటి నిషేధం లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
జస్టిస్ KM జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం, “మేము శాసనసభ వీక్షణకు భంగం కలిగించము. జల్లికట్టు తమిళనాడు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వంలో భాగమని అభిప్రాయపడింది కాబట్టి.. మేము కూడా ఆ అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాం. జంతు హింస చట్టం జల్లికట్టుకు వర్తించదు,” అని చెప్పినట్లు బార్ అండ్ బెంచ్ ఉటంకించింది.
జల్లికట్టు, ఎద్దుల బండ్ల పోటీలను అనుమతించే రాష్ట్రాల చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, PETA, CUPA, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ అండ్ యానిమల్ ఈక్వాలిటీ సహా పలు సంస్థలు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన జంతు హింస నిరోధక చట్టానికి సవరణను సవాలు చేశాయి. 2017లో, తమిళనాడు ప్రభుత్వం కేంద్ర చట్టాన్ని సవరిస్తూ రాష్ట్రంలో జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తరువాత రాష్ట్రపతి ఆమోదించారు. దీన్ని జంతు హక్కుల సంస్థ PETA సవాలు చేసింది, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదించింది.