హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 May 2024 12:06 PM ISTహిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆసక్తికర కామెంట్స్ చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వివాహం పవిత్రమైనదని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
ఈ మేరకు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలను చేసింది. ఇద్దరు వ్యక్తుల జీవితకాల, గౌరవాన్ని ధృవీకరించే, సమానమైన, అంగీకరంతో, ఆరోగ్యకరమైన కలయికను అందిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. హిందూవివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. సంప్రదాయబద్ధంగా వేడుక లేకుండా వివాహాలు జరిగితే.. ఏ సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్‌కు కూడా చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు వెల్లడించింది. విదేశాలక వలస వెళ్లడానికి వీసా కోసం దరఖాస్తు చేయడానికి యువ జంటల తల్లిదండ్రులు వివాహ నమోదుకు అంగీకరిస్తున్నారని గమనించినట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమయాన్ని ఆదా చేయచ్చు కానీ.. వివాహ వేడుకను పెండింగ్‌లో ఉంచుతున్నారని తెలిపింది. ఇలాంటి పద్దతులను తొలగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థకు పవిత్రత ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహం అనేది పాటలు, డ్యాన్స్‌లు, భోజనాలు చేయడం, కట్నకానుకలు, గిఫ్ట్‌లు తీసుకొనే సందర్భం కాదని వ్యాఖ్యానించింది. భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని నెలకొల్పడానికి జరుపుకునే పవిత్ర పునాది కార్యక్రమం ఇది అంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.