దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా కేసులను కట్టడి చేయడానికి ఆయా రాష్ట్రాలు ప్రణాళికలను రచిస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఆదివారాల్లో లాక్ డౌన్ విధించాలని భావిస్తూ ఉంది.
మధ్యప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో కరోనా మహమ్మారిని అరికట్టే నేపథ్యంలో కీలక చర్యలు తీసుకున్నారు.ఈ నేపధ్యంలో కరోనా కేసులు అధికంగా ఉన్న బైతూల్, ఛింద్వాడా, రత్లామ్, ఖర్గోనాలలో ఆదివారం లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండోర్, భోపాల్, జబల్‌పూర్ లలో కూడా ప్రతీ ఆదివారం లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ లాక్‌డౌన్ అమలుకానుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 26,90,646 మందికి టీకాలు వేశారు. ప్రతీరోజూ మూడు లక్షలమందికి కరోనా టీకాలు వేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 1,712 కరోనా కేసులు నమోదవ్వడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2,80,298కి చేరుకుంది.