అందుకే సీఎం వద్దకు వెళ్లా.. ఎన్సీపీ అసంతృప్త నేత
మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల విభజన తర్వాత కూడా రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి.
By Medi Samrat
మహారాష్ట్రలో మంత్రిత్వ శాఖల విభజన తర్వాత కూడా రాజకీయ ప్రకంపనలు తారాస్థాయికి చేరాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆగ్రహించిన ఎన్సీపీ నేత ఛగన్ భుజ్‌బల్ ఈరోజు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. భేటీ అనంతరం ఆయన తదుపరి నిర్ణయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. భుజ్‌బల్ బీజేపీలో చేరవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.
మహారాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో భుజ్‌బల్ ఎన్‌సీపీ అధినేత అజిత్ పవార్‌పై చాలాసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భుజ్‌బల్ తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు.. కానీ అది జరగకపోవడంతో అజిత్ పవార్‌పై విరుచుకుపడ్డారు. భుజబల్ మాట్లాడుతూ.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు విసిరివేయడానికి తాను ఎవరి చేతుల్లో ఆటబొమ్మను కాదని ఫైర్ అయ్యారు.
ఇటీవల దేవేంద్ర ఫడ్నవీస్ కూడా భుజబల్‌ను ప్రశంసించారు. తనను కేబినెట్‌లో చూడాలని సీఎంగా కోరుకుంటున్నానని ఫడ్నవీస్ చెప్పారు. కాగా.. భుజ్‌బల్ మద్దతుదారులు కూడా తనను బీజేపీలో చేరాలని కోరారు. బీజేపీ తనకు మంచి గౌరవం ఇస్తుందని అంటున్నారు.
మంత్రిత్వ శాఖల విభజన తర్వాత ఛగన్ భుజబల్ ఓబీసీ వర్గాల ప్రజలను కూడా కలిశారు. అంగ బలాన్ని గౌరవించకుంటే.. ఓబీసీ వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతుందని ఆయన మద్దతుదారులు తెలిపారు.
సమావేశం అనంతరం ఛగన్ భుజబల్ మాట్లాడుతూ.. ఓబీసీ వర్గాల సమస్యలను లేవనెత్తేందుకే తాను సీఎం వద్దకు వెళ్లానన్నారు. ఈ భేటీలో మరే ఇతర రాజకీయ అంశాలు చోటు చేసుకోలేదన్నారు.