సీబీఎస్ఈ మార్కింగ్ ఫార్ములా పట్ల విద్యార్థుల అసంతృప్తి..సుప్రీంలో పిటిషన్..!
Students reached Supreme Court.కరోనా విజృంభణ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)
By తోట వంశీ కుమార్
కరోనా విజృంభణ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని(30-30-40 ఫార్ములా) సీబీఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించగా.. అందుకు సుప్రీం కోర్టు కూడా ఆమోద ముద్ర వేసింది. జులై 31లోపున 12వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటిస్తామని సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ కోర్టుకు తెలిపాయి. అయితే.. సీబీఎస్ఈ విడుదల చేసిన మార్కింగ్ ఫార్ములా పట్ల 12వ తరగతి విద్యార్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు, సీబీఏస్ఈ విడుదల చేసిన ఫార్ములా ముమ్మాటికీ సమానత్వ హక్కుల ఉల్లంఘనేనని.. దేశంలోని 1152 మంది విద్యార్థులు ఈ విధానంపై ప్రశ్నలు వేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మార్కింగ్ ఫార్ములాకు పలు సూచనలు కూడా ఇచ్చారు. న్యాయవాది మను జైట్లీ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో విద్యార్థులు కంపార్టమెంటలైజ్డ్ కోసం ఒక విధానాన్ని తీసుకురావాలని కోరారు.
పిటిషనర్ల ప్రకారం.. కొత్త విధానం కంపార్ట్మెంట్, డ్రాప్ అవుట్, ప్రైవేట్ అభ్యర్థులకు మరో రకంగా తీసుకొచ్చారని, ఇది రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులలో సమాన హక్కు (ఆర్టికల్ 14) ను ఉల్లంఘించడమేనని కోర్టుకు తెలిపారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో బోర్డు ప్రవర్తించడం సరికాదని, అందరు విద్యార్థులను సమానంగా చూడాలని విద్యార్థులు తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు.
ఏంటీ ఈ 30-30-40 ఫార్ములా..
విద్యార్థులకు 12వ తరగతి తుది మార్కులను కేటాయించేందుకు సీబీఎస్‌ఈ చివరి మూడు తరగతుల (10, 11, 12) మార్కులను (30-30-40 ఫార్ములా ప్రకారం) పరిగణలోకి తీసుకోనున్నది. 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో సాధించిన ఫలితాల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయిస్తారు. 10వ తరగతిలోని ఐదు పేపర్ల నుంచి మెరుగైన మార్కులు సాధించిన మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇక, 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయిస్తారు. ఇందులో కూడా మెరుగైన మార్కులున్న మూడు పేపర్లను పరిగణలోకి తీసుకుంటారు. 12వ తరగతి ప్రీ బోర్డు పరీక్షల ఆధారంగా 40 శాతం మార్కులు కేటాయిస్తారు. 12వ తరగతిలో యూనిట్ టెస్టులు, ప్రాక్టికల్, అంతర్గత మూల్యాంకనంలో వచ్చిన మార్కులకు కూడా తుది మార్కుల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే ఈ మార్కులను ఆయా పాఠశాలలు సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశాయి. మరోవైపు, విద్యార్థి చివరి ఆరు తరగతుల్లో (12, 11, 10, 9, 8, 7 తరగతులు) సాధించిన మార్కుల ఆధారంగా.. సీఐఎస్‌సీఈ 12వ తరగతి తుది మార్కులను కేటాయించనున్నది.
విద్యార్థులు ఫెయిలైతే?
తుది ఫలితాల్లో ఎవరైనా విద్యార్థులు ఫెయిలైతే వారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులను 'ఎస్సెన్షియల్ రిపీట్ (తప్పనిసరిగా పరీక్ష నిర్వహించాలి)' లేదా 'కంపార్ట్‌మెంట్' క్యాటగిరీలో చేర్చుతారు. మూల్యాంకన విధానంతో ఇచ్చిన తుది మార్కులతో సంతృప్తిగా లేని విద్యార్థులు కూడా రాతపరీక్షలు రాయొచ్చు.