మహాశివరాత్రి రోజు మాంసాహారం పెట్టారని, ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణ
క్యాంటీన్‌లో మాంసాహారం వడ్డించే అంశంలో రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడి చేసుకున్నాయి.
By Knakam Karthik
మహాశివరాత్రి రోజు మాంసాహారం పెట్టారని ఢిల్లీలో విద్యార్థుల ఘర్షణ
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. క్యాంటీన్‌లో మాంసాహారం వడ్డించే అంశంలో రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. మహా శివరాత్రి రోజున మాంసాహారం వడ్డించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై యూనివర్సిటీ స్పందించకపోగా, తమకు ఎలాంటి కంప్లయింట్ అందలేదని పోలీసులు తెలిపారు. అయితే.. యూనివర్సిటీలో గొడవపపై బుధవారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో మైదాన్ గిరి పోలీస్ స్టేషన్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చిందని సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరు తెలిపారు.
కాగా యూనివర్సిటీ క్యాంటీన్‌లో విద్యార్థులు గొడవపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాంసాహారం వడ్డించడంపై క్యాంటీన్‌లో మొదట విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరగడం, ఆపై వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం వీడియోలో కనిపిస్తోంది. ఈ గొడవలో గాయపడిన విద్యార్థి పోలీసులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు.
మహాశివరాత్రి రోజు మాంసాహారం వడ్డించకూడదన్న తమ ఆదేశాలకు కట్టుబడలేదన్న కారణంతో ఏబీవీపీ విద్యార్థులు తమపై దాడిచేశారని ఎస్ఎఫ్‌ఐ విద్యార్థులు ఆరోపించారు. ఏబీవీపీ వాళ్లే తమపైనా, మెస్ సిబ్బందిపైనా దాడిచేశారని పేర్కొన్నారు. అంతేకాదు, విద్యార్థినుల జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. ఉపవాసంలో ఉన్న విద్యార్థులకు బలవంతంగా మాంసాహారం వడ్డించే ప్రయత్నం చేశారని ఏబీవీపీ తమ ఎక్స్ అకౌంట్‌లో రాసుకొచ్చింది. కాగా యూనివర్సిటీలో ఘర్షణ ఘటనపై అధికారులు, పోలీసులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
#दिल्ली में महाशिवरात्रि पर नॉनवेज खाने पर विवाद..#साउथ एशियन यूनिवर्सिटी में SFI और ABVP के छात्रों में झड़प.. #SouthAsianUniversity #Mahashivratri #Students #NonVeg pic.twitter.com/hYwmUMNicY
— News Art (न्यूज़ आर्ट) (@tyagivinit7) February 27, 2025