Vande Bharat Express : మ‌రోసారి వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి

ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొంద‌రు దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 March 2023 9:57 AM IST
Vande Bharat Express, West Bengal

వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌తీకాత్మ‌క చిత్రం

కేంద్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్ పై ఇటీవ‌ల కాలంలో వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయి. కొంద‌రు దుండ‌గులు రాళ్ల‌తో దాడులకు పాల్ప‌డుతున్నారు. తాజాగా ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సెమీ హైస్పీడ్ వందే భార‌త్ రైలు పై కొంద‌రు దుండ‌గులు రాళ్ల‌తో దాడి చేశారు.

హౌరా నుండి న్యూ జల్‌పైగురి వెలుతున్న వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ పై ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థ‌రాత్రి హౌరా స్టేషన్‌కు సమీపంలో రాళ్ల దాడి జ‌రిగిందని ఈ ఘ‌ట‌న‌లో రైలు కోచ్ కిటికీ అద్దాలు దెబ్బ‌తిన్నాయ‌ని తూర్పు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు రైల్వే సియాడ్ కౌసిక్ మాట్లాడుతూ.. ఇది చాలా దురదృష్టకర సంఘటన. దీనిపై విచారణ జరుపుతాం అని చెప్పారు.

కాగా.. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సీదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్‌లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తెలిపింది. మాల్దా సమీపంలోని హౌరా నుండి న్యూ జల్‌పైగురిని కలిపే రైలుపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కిటికీ అద్దాలు ప‌గిలిపోయాయి. జ‌న‌వ‌రి నెల‌లో ఇది రెండ‌వ ఘ‌ట‌న అని తెలిపింది.

Next Story