కుప్పకూలిన రైతు ఉద్యమ వేదిక.. రాకేశ్ తికాయత్‌కు తప్పిన ప్రమాదం
Stage Collapse At Farmer's Mahapanchayat. రైతు ఉద్యమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. 'మహా పంచాయతీ' భారీ సమావేశం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
By తోట వంశీ కుమార్ Published on 3 Feb 2021 11:10 AM GMTకేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకండా ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతు ఉద్యమంలో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. 'మహా పంచాయతీ' భారీ సమావేశం వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ పైన ఉన్న బీకేయూ నాయకుడు రాకేశ్ తికాయత్, బల్బీర్ సింగ్ రాజేవాల్‌లతో పాటు కీలక నేతలు, ఇతరులు స్టేజీపై నుంచి కిందపడిపోయారు.
రాకేశ్ తికాయత్ ప్రసంగించబోతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. స్టేజిపైకి ఎక్కువ మంది చేరడంతోనే కుప్పకూలి ఉంటుందని రైతులు చెబుతున్నారు. స్టేజీ కూలడంతో కిందపడిపోయిన రాకేశ్ తికాయత్, బల్బీర్‌సింగ్‌లను క్షేమంగా పక్కకు తరలించారు.
#WATCH | The stage on which Bharatiya Kisan Union (Arajnaitik) leader Rakesh Tikait & other farmer leaders were standing, collapses in Jind, Haryana.
— ANI (@ANI) February 3, 2021
A 'Mahapanchayat' is underway in Jind. pic.twitter.com/rBwbfo0Mm1
అంతకుముందు జింద్, బంగర్ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మహాపంచాయత్‌లో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేశ్ తికాయత్ రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో హర్యానా రైతులంతా పాల్గొని మరింత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. కేంద్రం పట్టు వీడి రైతుల గురించి ఆలోచించాలని సూచించారు.
ఇదిలా ఉంటే..రైతులు నిరసనలపై చర్చించాలని పార్లమెంట్ నిర్ణయించింది. రైతుల నిరసనలపై 15 గంటల పాటు చర్చించాలని విపక్ష పార్టీలు చేసిన డిమాండ్ ను కేంద్రం అంగీకరించింది. ఇందుకోసం రెండు రోజుల పాటు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని రాజ్యసభ నిర్ణయించింది. ఈ చర్చ రాజ్యసభలో జరుగుతుందని విపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని, వారి అన్ని సందేహాలు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక చర్చ అర్థవంతంగా సాగాలని బీజేపీ నేతలు అంటున్నారు.