స్పుత్నిక్ వ్యాక్సిన్లు వచ్చేస్తున్నాయి..!

Sputnik V will start arriving in this quarter.ఈ నెలలోనే రష్యా నుంచి స్పుత్నిక్ టీకాల దిగుమతి మొదలవుతుందని డాక్టర్ రెడ్డీస్ సంస్థ చెబుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 12:50 PM IST
Sputnik V covid 19 vaccine

భారత్ లో వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇతర దేశాల్లో అనుమతులు వచ్చిన వ్యాక్సిన్లను భారత్ లో కూడా ప్రజల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలని భావిస్తూ ఉన్నారు. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్లపై భారత్ దృష్టి పెట్టింది. ఆ దేశంతో సంప్రదింపులు జరిపింది కూడానూ..! రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వికి రెండ్రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. భారత్ లో ఆ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరికొన్ని సంస్థలతో రష్యా ఒప్పందం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈ నెలలోనే రష్యా నుంచి టీకాల దిగుమతి మొదలవుతుందని డాక్టర్ రెడ్డీస్ సంస్థ చెబుతోంది. ఏప్రిల్ – జూన్ మధ్య వ్యాక్సిన్ డోసులు వస్తాయని.. జులై – సెప్టెంబర్ మధ్య మన దేశంలో ఉత్పత్తి మొదలవుతుందని చెబుతున్నారు. ఫస్ట్ బ్యాచ్ లో వచ్చిన డోసులను కేంద్ర ప్రభుత్వం టెస్ట్ చేసి ఓకే చెప్పిన తర్వాత మే మధ్య నాటికి అవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దిగుమతులతో పాటు ఇక్కడ తయారు చేసే డోసులు కలిపి 12.5 కోట్ల డోసులకు ఒప్పందం చేసుకున్నామని, పరస్పర చర్చల అనంతరం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని రెడ్డీస్ ఏపీఐ అండ్ ఫార్మాస్యుటికల్ సర్వీసెస్ సీఈవో దీపక్ సాప్రా తెలిపారు.

స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎక్స్ఫైరీ గడువు ఆరు నెలల పాటు ఉంటుందన్నారు. ప్రస్తుతం మైనస్ 18 డిగ్రీల నుంచి మైనస్ 22 డిగ్రీల శీతల పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా వ్యాక్సిన్ ను నిల్వ చేసుకునేలా డేటాను చెక్ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో ఆ సమాచారం అందుబాటులోకి వస్తుందని, ఆ తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఆ డేటాను సమర్పించి నిల్వ సమచారంలో సవరణలు చేస్తామని డాక్టర్ రెడ్డీస్ సంస్థ చెబుతోంది.


Next Story