సౌరవ్ గంగూలీకి బీజేపీ ఆఫర్..దాదా ఏమంటారో..!
పశ్చిమబెంగాల్ నుంచి గంగూలీని రాజ్యసభ బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 July 2023 5:10 AM GMTసౌరవ్ గంగూలీకి బీజేపీ ఆఫర్..దాదా ఏమంటారో..!
సౌరవ్ గంగూలీ భారత దిగ్గజ క్రికెటర్. ఈయన పేరు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా క్రీడా అభిమానులు గంగూలీని దాదా అని పిలుచుకుంటారు. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అయితే.. ఇప్పుడు బీజేపీ గంగూలీకి ఆఫర్ ఇచ్చింది. రాజ్యసభ బీజేపీ సీటు ఆఫర్ చేసింది. పశ్చిమబెంగాల్ నుంచి గంగూలీని రాజ్యసభ బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది. బెంగాల్‌లో ఏకైక రాజ్యసభ బీజేపీ సీటు ఖాళీ కానుంది. ఈ క్రమంలో ఆ సీటుకి అభ్యర్థులుగా గంగూలీతో పాటు బెంగాల్ మెగాస్టార్ మిథున్ చక్రవర్తి పేరుని కూడా బీజేపీ పరిశీలిస్తోంది. అంతేకాదు.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పంపిన మరికొందరి పేర్లను కూడా బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారు.
బీజేపీ జాతీయ నాయకత్వానికి నేతలు రెండు వేర్వేరు జాబితాలను ఢిల్లీకి పంపినట్లు తెలుస్తోంది. ఒక జాబితాను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఇవ్వగా.. మరోటి సువేందు అధికారి పంపారు. సువేందు అధికారి పంపిన లిస్ట్‌లో నలుగురి పేర్లు ఉన్నాయి. గంగూలీ, మిథున్ చక్రవర్తి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్బన్ గంగూలీ, గ్రేటర్ కూచ్‌బెహార్ పీపుల్స్ అసోసియేషన్ చైర్మన్ అనంత్ మహారాజ్ పేర్లను సువేందు అధికారి ప్రతిపాదించారు. మజుందార్ పంపిన లిస్ట్‌లో రూపా గంగూలీ, స్వపన్ దాస్ గుప్తా, బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేశ్ త్రివేది, అనంత్ మహరాజ్ పేర్లు ఉన్నాయి. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పని చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జైషా ద్వారా బీజేపీ పెద్దలతో గంగూలీకి సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయని పలువురు భావిస్తున్నారు. అంతేకాదు.. బెంగాల్ బీజేపీ నాయకులు పంపిన లిస్ట్‌లో గంగూలీకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. గంగూలీ రాజ్యసభ పదవిపై ఇంకా స్పందించలేదు. మరి గంగూలీ బీజేపీ ఆఫర్‌ను స్వీకరిస్తారా..? లేదంటే సున్నితంగా తిరస్కరిస్తారా? అన్నది చూడాలి.