పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. వీరి ఇబ్బందులను గమనించిన నటుడు సోనూ సూద్, వారికి ఉచిత వసతి కల్పిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
సోనూ సూద్ ఒక వీడియో సందేశం ద్వారా స్పందిస్తూ, "దుబాయ్‌లో చిక్కుకుపోయిన వారు ఎవరైనా, ఏ దేశస్థులైనా సరే.. మీకు ఉండటానికి చోటు లేకపోతే నాకు నేరుగా సందేశం (DM) పంపండి. మీరు తిరిగి మీ దేశాలకు చేరుకునే వరకు మీకు కావాల్సిన వసతి సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు. కేవలం భారతీయులకే కాకుండా, ఇతర దేశాల ప్రయాణికులకు కూడా ఈ సాయం వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఫిబ్రవరి చివరలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేయడంతో దుబాయ్ వంటి ప్రధాన ట్రాన్సిట్ హబ్‌లలో ప్రయాణికులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. గతంలో కోవిడ్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను గమ్యస్థానాలకు చేర్చి 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన సోనూ సూద్, ఇప్పుడు అంతర్జాతీయ సంక్షోభ సమయంలోనూ తన మానవత్వాన్ని చాటుకోవడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.