రాజ్యసభకు సోనియాగాంధీ, జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక
రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయగా.. ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 20 Feb 2024 6:10 PM ISTరాజ్యసభకు సోనియాగాంధీ, జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ సుదీర్ఘకాలం పాటు లోక్‌సభలో ఉన్నారు అందరికీ తెలిసిందే. దాదాపు 25 ఏళ్లపాటు లోక్‌సభకు ప్రాతినిథ్య వహించిన ఆమె.. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయగా.. ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. జేపీ నడ్డా గుజరాత్ నుంచి ఏకగ్రీవంగా రాజ్యసభ సభకు ఎన్నిక అయ్యారు.
రాజ్యసభలో ఏర్పడిన ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారంతో ముగిసింది. దాంతో.. పలు స్థానాల్లో నామినేషన్లు ఒక్కరివే మిగిలిపోవడంతో ఏకగ్రీవం అవుతున్నట్లు ప్రకటించారు అధికారులు. రాజస్థాన్ నుంచి ఖాళీ కానున్న మూడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, బీజేపీ నుంచి చున్నిలాల్ గరాసియా, మదన్‌రాథోడ్ నామినేషన్ వేశారు. పోటీలో అక్కడ ఇంకెవరు నిలవలేదు. దాంతో.. వీరి ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఇక గుజరాత్‌లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో జేపీ నడ్డా సహా బీజేపీ నుంచి నలుగురు పోటీకి దిగారు. ఇంకెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. వీరి ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా.. జేపీ నడ్డా 2012, 2018లో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎగువ సభకు ప్రాతినిథ్యం వహించారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ తగినంత బలం లేదు ..దాంతో.. నడ్డాను గుజరాత్‌కు మార్చారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రాజ్యసభ స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది.