కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా వేవ్ కొనసాగుతోంది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు ఆస్పత్రులన్ని కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కొందరు ఈ మహమ్మారి నుంచి కోలుకుంటుండగా.. మరి కొందరు దీని బారిన పడి మృత్యువాత పడుతున్నారు. చాలా కుటుంబాల్లో ఇంటి పెద్ద కరోనాతో మరణించడంతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ కరోనాతో చనిపోవడంతో వారి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దేశంలో రెండు నెలల వ్యధిలో సుమారు 577 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 25 (మంగళవారం) మధ్యాహ్నాం 2 గంటల వరకు దేశ వ్యాప్తంగా 577 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు గుర్తించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఈ మేరకు కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి నివేదికలు అందాయన్నారు. ప్రస్తుతం ఈ చిన్నారులు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు నిమహన్స్ రెడీగా ఉందన్నారు. ఇలాంటి చిన్నారులను చూసుకునేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి నిధుల కొరత లేదన్నారు.
కరోనా సెకండ్ వేవ్‌లో ఏ ఆసరా లేని వృద్దులను, తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ చిన్నారులను ఆదుకోవాలని ఇటీవల రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే.