సీతారాం ఏచూరి కుమారుడిని బలితీసుకున్న కరోనా మహమ్మారి

Sitaram yechury son ashish yechuri passes away.సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి కరోనా కారణంగా మరణించారు. .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2021 12:31 PM IST
ashish yechuri passes away

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడి మృతి చెందారు. సీపీఎం సీనియర్‌ నేత సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్‌ ఏచూరి కరోనా కారణంగా మరణించారు. ఇటీవల ఆశిష్‌కు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆయన్ని చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం ఆశిష్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీతారాం ఏచూరి ట్విటర్‌లో పేర్కొన్నారు.34 ఏళ్ల ఆశిష్‌ ఓ ప్రముఖ వార్తాపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

'ఈ రోజు ఉదయం నా పెద్ద కొడుకు ఆశిష్ ఏచూరీ కరోనాతో మృతి చెందడం చాలా బాధాకరం. ఆశిష్‌ను బతికించడానికి చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు. వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మాకు అండగా నిలిచారు' అని ఆయన ట్వీట్‌ చేశారు.

సీతారాం ఏచూరి కుమారుడి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏచూరి కుమారుడి మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ట్వీట్లను చేశారు.

భారతదేశంలో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! గత 24 గంటల్లో‌ కొత్త‌గా 3,14,835 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో‌ 1,78,841 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,59,30,965 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 2,104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,84,657కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,34,54,880 మంది కోలుకున్నారు. 22,91,428 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


Next Story