సహోద్యోగినిపై ఆ కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు
ఆఫీసులో సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.
By అంజి
సహోద్యోగినిపై ఆ కామెంట్స్ చేయడం లైంగిక హింస కాదు: హైకోర్టు
ఆఫీసులో సహోద్యోగినిపై కామెంట్స్ చేయడం, పాటలు పాడటం లైంగిక హింస కిందకు రాదని బాంబే హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. కార్యాలయంలో లైంగిక వేధింపుల కేసులో ఒక పురుష బ్యాంకు ఉద్యోగిపై అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) నివేదిక, పూణే పారిశ్రామిక కోర్టు తీర్పును బాంబే హైకోర్టు పక్కన పెట్టింది. ఆ తీర్పులు అస్పష్టంగా, నిరాధారమైనవిగా బాంబే హైకోర్టు పేర్కొంది. న్యాయవాది సనా రయీస్ ఖాన్ ద్వారా ICC సెప్టెంబర్ 30, 2022 నివేదికను సవాలు చేసిన ఉద్యోగికి అనుకూలంగా జస్టిస్ సందీప్ మార్నే తీర్పు ఇచ్చారు. కార్యాలయంలో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు కమిటీ నిర్ధారించింది, ఈ నిర్ణయాన్ని జూలై 2024లో పారిశ్రామిక కోర్టు సమర్థించింది.
తన జుట్టు గురించి ఓ సహోద్యోగి కామెంట్స్ చేస్తూ పాటలు పాడారని.. మహిళల ఎదుట పురుషుల మర్మావయాల గురించి మాట్లాడారని పుణేలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉద్యోగిని తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. మహిళా సహోద్యోగి పొడవాటి జుట్టు గురించి జోక్ చేసి, దానిని కట్టడానికి జేసీబీ కావాలేమో అంటూ ఎగతాళి చేశాడు. దీంతో అతడిని బ్యాంకు డిమోట్ చేసింది. ఆ తర్వాత అతడు పారిశ్రామిక కోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా చుక్కెదురవడంతో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సహోద్యోగిని చేసిన ఆరోపణలు నిజమని అంగీకరించినప్పటికీ, అవి POSH చట్టం కింద లైంగిక వేధింపులకు ప్రమాణాలకు అనుగుణంగా లేవని జస్టిస్ మార్నే తేల్చిచెప్పారు. ICC యొక్క పరిశోధనలు సరైన విశ్లేషణలో లేవని కోర్టు తీర్పునిస్తూ వాటిని తోసిపుచ్చింది.